ప్రజలు, వారి ప్రయోజనాల కోసం పాటుపడే రాజకీయ పార్టీ, నాయకులే రాణిస్తారు తప్ప స్వలాభం కోసం ప్రజలను వాడుకోవటం అలవాటైన వారు ఎప్పటికీ రాణించరు. ప్రజలను మభ్యపెట్టి ఒకటి,రెండు సార్లు గెలిచినా ఆ తరువాత మాత్రం అడ్రస్ లేకుండాపోతారు. జనతా పార్టీ పరివార్‌కు చెందిన పలు పార్టీలు ఇప్పుడిలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నాయి. తమ అడ్రస్ గల్లంతు కాకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా శర వేగంతో దూసుకుపోతుంటే జాతీయ పార్టీగా తనకు తాను సర్ట్ఫికేట్ ఇచ్చుకునే కాంగ్రెస్‌తోపాటు తమను తాము జాతీయ పార్టీలుగా ముద్ర వేసుకునే మరికొన్ని పార్టీలు ప్రజాదరణ కోల్పోతూ రాజకీయంగా ఊపిరాడని పరిస్థితిలో పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర చిన్నా, చితక పార్టీల పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అందుకే తమ రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు పలు పార్టీలు నానా తంటాలు పడవలసి వస్తోంది. దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నప్పుడే జనతా పార్టీ ఏర్పడింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రథ చక్రాల కింద పడి నలిగిపోతున్న సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతా దళ్ సెక్యులర్, ఇండియన్ నేషనల్ లోకదళ్, సమాజ్‌వాదీ జనతా పార్టీలు రాజకీయావసరాల కోసం ఏకమై మరోసారి జనతాదళ్ పునరుద్భవానికి ప్రయత్నిస్తున్నాయి. జనతా పార్టీ నుండి విడిపోయిన తరువాత రాజకీయంగా ఎంతో విజయాన్ని సాధించి ఒడిశాలో గత పదిహేను సంవత్సరాల నుండి అధికారంలో ఉంటున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజూ జనతా దళ్ మాత్రం జనతా పరివార్ సమైక్య చర్చకు దూరంగా ఆంటోంది. జనతా దళ్ పునర్జన్మ అధికారికంగా జరిగిన తరువాతనే నవీన్ పట్నాయక్‌తో మాట్లాడాలని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు భావిస్తున్నారు. బి.జె.డి చేరితే జనతా పరివార్ కూటమి పరువు, ప్రతిష్టతోపాటు రాజకీయ పలుకుబడి బాగా పెరుగుతుంది. అయితే నవీన్ పట్నాయక్ తన అధికారాన్ని ఇతరులతో పంచుకునేందుకు అంగీకరిస్తారా? అనేది అనుమానమే. లోక్‌సభలో పదిహేను మంది సభ్యులు, రాజ్యసభలో ఇరవై ఐదు మంది సభ్యులున్న జనతా పరివార్ ఈ నెలాఖరుకు తమ నాయకులను ఎన్నుకుని పార్లమెంటు లోపల, బైట ఎన్.డి.ఏ ప్రభుత్వంతో పోరాడాలని కలలు కంటోంది. నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రాంతీయ పార్టీల కాలం చెల్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేసేందుకు జనతా పరివార్ పార్టీలు విఫల యత్నం చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఈ పార్టీల కూటమికి లోక్‌సభలో నాయకత్వం వహించేందుకు ఉవ్విళ్ళూరుతుంటే జె.డి యు అధ్యక్షుడు శరద్ యాదవ్ రాజ్యసభ నాయకత్వం వహించాలనుకుంటున్నాడు. సమాజ్ వాదీ పార్టీకి లోక్‌సభలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు కావటం గమనార్హం. కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండటంతో కేంద్రంలో ములాయం సింగ్ మాటలు పట్టించుకునే నాథుడు కనిపించటం లేదు. జనతా దళ్ యునైటెడ్, జనతా దళ్ సెక్యులర పార్టీల పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. గత లోక్‌సభ ఎన్నికల్లో 44 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించిన భాజపా అధినాయకత్వం మిగతా ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయటం లేదు. బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను తుద ముట్టించేందుకు అమిత్ షా ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. అందుకే జనతా పరివార్ పార్టీలు ఇప్పుడు సమైక్య రాగం అందుకున్నాయ. బీహార్‌లో కొంత కాలం క్రితం జరిగిన ఉపఎన్నికల్లో సమైక్యంగా పోరాడి మెజారిటీ సీట్లు గెలుచుకున్న జనతా పరివార్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలతోపాటు జాతీయ స్థాయిలో ఈ రాజకీయ సమీకరణాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాయి. జనతా పరివార్‌ను సమీకరించేందుకు ములాయం సింగ్ యాదవ్ పడుతున్న కష్టం వెనక ప్రజా ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజన లక్ష్యాలే అధికంగా ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే పక్షంలోదానిని ఎదిరించేందుకు రాజకీయశక్తుల పునరేకీకరణం జరిగితే ప్రజలు హర్షిస్తారు కానీ కాని అందుకు భిన్నంగా స్వీయ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కొన్ని చిన్నా,చితకా పార్టీలు సమైక్య రాగం పడితే ప్రజలు బలపరచటం కష్టం. దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడే రాజకీయ పార్టీలు, నాయకులకు సగటు మనిషి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. దీనికి విరుద్ధలక్ష్యంతో ముందుకు వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ప్రజల మద్దతు లభించటం సులభం కాదు. జనతా పరివార్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడటం లేదా జనతా దళ్ పేరుతో మరోసారి ముందుకు వచ్చి ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామంటే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగా పాత జనతా దళ్ పేరుతో కొత్త రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: