ఆంధ్రా.. ఎన్నో సహజవనరులు, సారవంతమైన నేలలు ఉన్న ఈ రాష్ట్రానికి దేశంలోనే రెండో అతి పొడవైన తీర ప్రాంతముంది. ఇది ఒక రకంగా గర్వపడే విషయమే అయినా.. అనేక ప్రకృతి విపత్తులకు కారణం కూడా. తుపాన్లు, సునామీలు, వాయుగుండాలు.. తరచుగా ఈ తీరాన్ని పలకరిస్తుంటాయి. సరిగ్గా పంటలు చేతికొచ్చే సమయంలోనే ఏదో ఒక తుపాను వచ్చి నోటిదగ్గర ముద్దను నీటిపాలు చేస్తుంది. ఇది ఆంధ్రాప్రజలకు ఎన్నోసార్లు అనుభవమే. ఐతే.. ఇప్పుడు అంతకన్నా.. భయంగొలిపే విషయం ఏమిటంటే.. ఏపీ తీర ప్రాంతాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయట.                                                     ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం.. పొట్టిగా ఇన్‌కాయిస్ అని పిలుస్తుంటాం. ఆ సంస్థ ఈ సంగతి స్పష్టం చేసింది. హుదుద్ తుపాను తర్వాత పరిస్థితులపై అధ్యయనం చేసిన ఈ సంస్థ. దక్షిణ కోస్తా జిల్లాలు తీరప్రాంత ప్రమాద సూచికలో అగ్రభాగాన ఉన్నట్టు గుర్తించాయి. తీరప్రాంతంలో జరుగుతున్న మార్పులు, సముద్ర మట్టాల్లో నమోదైన వ్యత్యాసాలు, అలల ఎత్తు, తీరాన్ని తాకుతున్న అలల మధ్య సమయ వ్యత్యాసం ఇలాంటి వేర్వేరు అంశాలపై ఇన్ కాయిస్ లోతైన అధ్యయనం చేసింది.                                      దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇన్‌కాయిస్ సంస్థతో పాటు భూభౌతిక విజ్ఞాన శాస్త్ర సంస్థ.. సంయుక్తంగా తీరప్రాంత మార్పులపై అధ్యయనం నిర్వహించాయి. అనేక పరిణామాలను అధ్యయనం చేసిన ఈ సంస్థలు... వివిధ అంశాల్లో ప్రమాద తీవ్రత సూచికల్ని రూపొందించాయి. ఈ సూచికలోని ఐదు అంశాల్లో కోస్తాంధ్ర తీరప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని ఇన్‌కాయిస్‌ తేల్చింది. ఏపీలో మొత్తం 970 కిలోమీటర్ల తీర ప్రాంతం.. అందులో 465 కిలోమీటర్ల తీరప్రాంతం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని తెలిపింది.                               కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల తీరాలు దక్షిణ కోస్తాతో పోలిస్తే... కాస్తంత మెరుగ్గానే ఉన్నాయట.. ఒడిశా, పశ్చిమ బంగాల్, కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, తమిళనాడుతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం ఎక్కువ కోతకు గురవుతోందని ఇన్‌కాయిస్ వెల్లడించింది. తీరంలో మడ అడవుల లాంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు లేకపోవడం వల్లే... ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోందని ఇన్‌కాయిస్‌ అధ్యయనం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: