మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మరణం మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అవుతుందా ? ఇన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ మరణంపై ఆయన సతీమణి ఎందుకు విచారణకు పట్టుబడుతున్నారు. ఈ అంశం మరోసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపనుందా? తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన నేత ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతో నాటి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ను తరిమి కొట్టిన నాయకుడు. మూడు దఫాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నగారు... తెలుగు తెర అభిమాన నాయకుడిగా, ప్రజానేతగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ 1995లో ఎన్టీఆర్ మరణించారు. అప్పట్లోనే ఎన్టీఆర్ మరణంపై విచారణ జరపాలని ఆయన భార్య లక్ష్మీ పార్వతి డిమాండ్ చేసినా... అప్పటి రాజకీయ పరిస్తితులు అందుకు సహకరించలేదు. అడపాదడపా ఈ విషయంపై ఎవరో ఒకరు మాట్లాడినా దాన్ని పట్టించుకున్న వారు లేరు. అయితే దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మరణం... మరోసారి తెర మీదకు వచ్చింది. అన్నగారి మృతిపై విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీ హన్మంతరావుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీహెచ్ మాటకు మద్దతు పలికిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కేసీఆర్కు లేఖ రాశారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన అన్నగారి మృతిపై విచారణ జరపాలంటూ కేసీఆర్కు లేఖ రాశారు. చివరి రోజుల్లో ఆయన ఎంతో మానసిక క్షోభ అనుభవించారని కూడా చెప్పే వారు ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ మరణంపై ఎన్నో ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల అన్నగారు మృతి చెందారని కొందరు వాదించారు. అయితే వాటిని ఖండించారు లక్ష్మీపార్వతి.మరణించే రోజు ఏం జరిగిందో అందరికీ తెలియాలన్న ఆమె... తనపై నిందలు మోపిన వారి సంగతి కూడా తేల్చాలన్నారు.ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది లక్ష్మీ పార్వతి డిమాండ్. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నగారి మరణంపై విచారణ జరపాలన్న లక్ష్మీ పార్వతి డిమాండ్... మరోసారి రాజకీయ దుమారానికి కేంద్ర బిందుకు అవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని అభిమానుల్ని సంపాదించుకున్న అన్నగారి మరణం మిస్టరీ ఉందా.... ఇప్పుడు జనం కూడా ఇదే అంశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: