ఆంధ్రా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బూమ్ సంగతి తెలిసిందే.. ఎలాంటి భూమైనా ఎకరా ధర కోటిపైమాటే పలుకుతోంది. మరి ఒక్కసారిగా ఉన్నపళంగా పెరిగిన ధరలు సామాజిక బంధాలను ప్రభావితం చేస్తున్నాయి. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. పచ్చనోట్ల వరద.. కుటుంబ బంధాలను సైతం తెంచేస్తోంది. తండ్రి- కొడుకు, అత్త -కోడలు, తాత - మనవడు.. ఇలా అన్ని బంధాలను అది డబ్బుమయం చేస్తోంది.                                   రాజధాని మండలాల్లో భూవివాదాలు, తగాదాలు, ఆస్తి పంపకాల వివాదాలు బాగా పెరిగిపోతున్నాయి. తుళ్లూరు, దాని పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాల్లో ఇలాంటి గొడవలు రోజూ తహిశీల్దారు కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు చేరుతున్నాయి. కొడుకులకు భూములు పంచేసి.. తమ జీవిక కోసం ఉంచుకున్న భూముల పత్రాలను కూడా తండ్రుల నుంచి కొడుకులు లాగేసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఎప్పడో ఐదు, పదేళ్ల కిందట ఆస్తి పంపకాల విషయాలు కూడా ఇప్పుడు వివాదాలుగా మారుతున్నాయి.                      అప్పట్లో.. ఎకరం, అర ఎకరం పంపకాల్లో తేడా వచ్చినా పట్టించుకోని వారసులు.. ఇప్పుడు భూముల ధరలు కోట్లకు చేరేసరికి..ఇప్పుడు వాటిని వెలుగులోకి తెస్తున్నారు. తమకు అప్పుడు అన్యాయం జరిగిందని.. ఇప్పుడు తమకు మళ్లీ సరిగ్గా పంపకాలు చేయాల్సిందేనని చెబుతున్నారు. పెళ్లిళ్లు అయిపోయిన కూతుళ్లు ఇప్పుడు మళ్లీ పుట్టింటికి వచ్చి.. తమ వాటాల విషయంపై పేచీ పెడుతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ మహానుభావుడి మాటలు.. ఆంధ్రా రాజధాని విషయంలో మరోసారి రుజువవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: