రాజకీయాల్లో తర్కానికి విలువ ఉండదేమో.. ఏం చేసినా ప్రత్యర్థిని కట్టడి చేయడమొక్కటే లక్ష్యమేమో.. ఏ చేసైనా సరే శత్రువుపై పైచేయి సాధించడమొక్కటే లక్ష్యమేమో.. అవును ఈ అనుమానాలన్నీ ఆంధ్రా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ వైఖరి చూసిన వారికెవరికైనా కలుగుతాయి. ఔను మరి. చివరకు చావులను సైతం రాజకీయం చేయగలుగుతున్నారంటే.. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉండాలో కదా.                     ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే చనిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. అప్పటికీ చెన్నై పంపి వైద్యం చేశారు. రెండు బైపాస్ సర్జరీలు కూడా చేయించారట. కానీ ఫలితం దక్కలేదు. శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజు ఆయన మృతికి సంతాప తీర్మానం పెట్టారు. అది ఆనవాయితీ.. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చనిపోయన వ్యక్తి ఎలాంటి వారైనా... వారి గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకుంటారు. మౌనం పాటిస్తారు.                           తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే..ఆ సమయంలో జగన్ చేసిన విమర్శలే అందర్నీ ఆశ్చర్యపరిచాయి. తన ఆరోగ్యం బాగు చేయించమని వెంకట రమణ చంద్రబాబును కోరారని జగన్ అసెంబ్లీలో చెప్పారు. సింగపూర్ తీసుకెళ్లి వైద్యం చేయించి బతికించమని వెంకటరమణ చంద్రబాబును అడిగారట. చంద్రబాబేమో.. కార్పొరేట్ మంత్రులతో కలసి సింగపూర్ టూర్ కు ఓకే చెప్పారు.. కానీ వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదట.                          ఆరోజు చంద్రబాబు వెంకట రమణను కూడా సింగపూర్ తీసుకెళ్లి ఉంటే.. ఇవాళ ఇలా సంతాపం చెప్పే అవసరం వచ్చి ఉండేది కాదని జగన్ చెప్పారు. సంతాప సమయంలో జగన్ చేసిన విమర్శలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఒకవేళ జగన్ చెప్పేదే నిజమైతే.. చంద్రబాబు మంచి నాయకుడు ఎంత మాత్రం కాదు.. ఒకవేళ జగన్ కేవలం రాజకీయాల కోసమే ఈ విమర్శ చేసి ఉంటే.. ఇలాంటి చవకబారు విమర్శలతో లాభం పొందలేరని ఆయన గ్రహించడం మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: