ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబానికి హిందూపురానికి విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి అసెంబ్లీకెళ్లారు. గత ఎన్నికల సమయంలో బాలయ్య హిందూపురం వాసులకు ఓ హామీ ఇచ్చారు.                              హిందూపురాన్ని జిల్లాగా చేస్తానని.. దానికి తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెడతానని ఎన్నికల్లో బాలయ్య చాలా సభల్లో వాగ్దానం చేశారు. ఇప్పటికీ ఆయన ఆ మాటకు కట్టుబడే ఉన్నారు. ఐతే.. ఇక్కడే ఓ చిక్కువచ్చింది. కొత్త రాజధానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్ బాగా వినిపిస్తోంది. అలా చేస్తే.. కొత్త రాజధానికి, హిందూపంర జిల్లాకు రెండింటికీ ఎన్టీఆర్ పేరు పెట్టడం అంత సముచితంగా ఉండదు.                           ఈ పేరు చిక్కుపై గురువారం అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణ, అనంతపురంజిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఒకవేళ కొత్తరాజధానికే ఎన్టీఆర్ పేరు పెడితే హిందూపురం జిల్లాకు ఏ పేరు పెడదాం అన్న విషయంపై వారు చర్చించారు. తాను మాత్రం హిందూపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకే సుముఖంగా ఉన్నానని.. రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే అప్పుడు అందరం కలసి హిందూపురంపై ఆలోచిద్దామని బాలకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు పాలనలో ఎన్టీఆర్ పేరుకు మాత్రం భలే డిమాండ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: