దేశంలో పలు ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న వివాదాస్పద మత మార్పిళ్ల అంశంపై పార్ల మెంటు మరోమారు దద్దరిల్లింది. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరయ్యారు. మోడీ సభలో ఉండగానే మత మార్పిళ్ల అంశంపై ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య వాదోప వాదాలు కొనసాగాయి. పదేపదే వాయిదాలతో సభలో ఒక దశలో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చ చేపట్టాలని, ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలన్నీ ముక్తకంఠంతో నినదించాయి.ప్రభుత్వం కూడా అంగీకరిం చడంతో చర్చకు అనుమతిస్తూ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటన చేయగానే..ప్రధాని వివరణతోనే చర్చ ప్రారం భించాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో చర్చ ప్రారంభించకుండానే సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. కాంగ్రెస్‌ సభాపక్ష ఉపనేత ఆనంద్‌ శర్మ, సిపిఎం నేత సీతారాం ఏచూరి, బిఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ప్రధాని మౌనం వీడాల్సిందేనన్నారు. ప్రతిష్టంభనకు తెర దించాలనీ ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మంచి వక్త అయినందున సమాధానమివ్వాలని ఆనంద్‌ శర్మ కోరారు. సభ వెలుపల ఉపాన్యాసాలు దంచినట్లుగానే సభలోపల కూడా సభ్యుల అభిప్రాయాలపై ప్రధాని వివరణ ఇవ్వవచ్చని జెడియు నేత శరద్‌ యాదవ్‌ సూచించారు. 'రెండు వారాల కిందట జరిగిన పాత అంశంపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేద'ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడంతో గందరగోళానికి ఆజ్యం పోసినట్లైంది. జైట్లీ వ్యాఖ్యలను ఆనంద్‌ శర్మ తిప్పికొట్టారు. ప్రధానమంత్రి హోదాను దిగజార్చాలనే ఉద్దేశమేదీ తమకు లేదని, అయితే ఈ అంశంపై సభలో తప్పనిసరిగా చర్చ జరగాల్సిందేనని కోరారు. బిఎస్సీ సభ్యులు మాయవతి కూడా ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. 'మాట్లాడాల్సిందిగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. పరువు విషయంగా ఆయన ఈ అంశాన్ని చూడరాదు' అని ఆమె విన్నవించారు.  ఏదైనా ఒక అంశంపై చర్చ జరిగాల్సివచ్చినప్పుడు సంబంధిత మంత్రి బదులిస్తారని, ఈ అంశంపై హోంమంత్రి జవాబిస్తారని పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రధాని వివరణ కోసం పట్టుపట్టిన ప్రతిసారీ వెంకయ్య నాయుడు ఇదే సలహా చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే మెజార్జీ ఉందన్న దురహంకారంతో ప్రతిపక్ష సభ్యులున్నారని జైట్లీ వ్యాఖ్యానించడంతో సభలో మరింత వేడి రాజుకుంది. జైట్లీ వ్యాఖ్యలను సిపిఎం సభ్యులు సీతారం ఏచూరీ ఘాటుగా తిప్పికొట్టారు. లోక్‌సభలో మెజార్జీతో సాగిస్తున్న దౌర్జన్యం ఇక్కడ సాగబోదని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: