రాచకొండ గుట్టల్లో సినిమా సిటీ నిర్మిస్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఇపుడా ప్రాంతం అందరినీ ఆకర్షిస్తున్నది. చారిత్రక ప్రాధాన్యం, అందమైన ప్రకృతికి ఆలవాలమైన ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి భూముల పరిస్థితిపై దృష్టి సారించినపుడు సీమాంధ్ర పాలనలో ఇక్కడ అడ్డగోలుగా జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు కేవలం 30-40 కిలో మీటర్ల దూరంలో పర్యాటక ప్రాంతంగా ఉండడంతో సీమాంధ్ర రియల్టర్లు ఇక్కడ అడ్డగోలుగా లేఅవుట్లు వేశారు. సర్కారు దన్నుతో అసైన్డ్ భూములనుంచి సర్కారు భూముల దాకా కనిపించిన ప్రతి ఎకరాన్ని కబ్జా పెట్టారు. అటవీభూములు మింగేశారు. చచ్చిపోయిన వారి పేరిట సంతకాలు పెట్టించుకున్నారు. ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అధికారులు ఎంతగా కండ్లు మూసుకుని పనిచేశారంటే.. ఇక్కడ వ్యవసాయ భూములను కనీసం కన్వర్షన్ కూడా చేయకుండానే లేఅవుట్లు వేసుకుంటే ఇదేమని అడుగలేదు. అనేక లే అవుట్లకు ఇప్పటికీ అనుమతులు లేవు. ప్రధానంగా రాచకొండ గ్రామ పరిధిలోని వందల ఎకరాలను ప్లాట్లుగా అమ్మేశారు. రెవెన్యూ రికార్డుల్లో, క్షేత్ర స్థాయిలో నేటికీ అవి వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. ల్యాండ్ కన్వర్షన్ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లు కూడా మారలేదు. లేఅవుట్లకు అనుమతుల్లేవు. సర్‌ప్లస్ భూముల్లో భారీ మాయాజాలం చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రియదర్శిని నివేదిక తొక్కిపెట్టారు... 2008లోనే ఈ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, దీనికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు 2008 డిసెంబర్ మూడో తేదీన అప్పటి నల్లగొండ జాయింట్ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని విచారణ జరిపారు. క్షేత్ర స్థాయి భూములు, రికార్డుల పరిశీలన చేసి అవకతవకలు నిర్ధ్దారిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆమె సమర్పించిన నివేదికతో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, కొన్ని అంశాల్లో క్రిమినల్ చర్య లు చేపట్టాలని కూడా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కానీ రియల్టర్ల అవతారంలో వైజాగ్, విజయవాడకు చెందిన కొందరు బడాబాబులు ఉండడంతో ఆ నివేదికను తొక్కి పెట్టారు. ఈ విషయమై ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనాకు కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ దర్యాప్తులో తేలిన అంశాలు ప్రియదర్శిని నివేదికలో అనేక అవకతవకలు గుర్తించారు. రాచకొండ ప్రాంతంలోని సర్‌ప్లస్ భూములను 2001 నుంచి పలు దఫాలుగా వందల మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పొసెషన్ చూపకపోవడంతో రియల్టర్లు తెగబడ్డారు. వారు కొనుగోలు చేసిన భూములకు ఎలాంటి ఎన్‌ఓసీలు లేవు. అయినా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కండ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు కొన్ని లేఅవుట్లు ల్యాండ్ కన్వర్షన్లు జరిగినా నిబంధనలను పాటించలేదు. అనుమతి లేకుండా లేఅవుట్లు....సర్వే నంబర్ 8 నుంచి 28, 32 నుంచి 39, 43, 76, 78, 79, 82, 83, 84, 273, 284, 106, 31, 113, 161, 162, 163, 474, 469, 446, 467, 32 నుంచి 36, 924, 643, 656లల్లో అనేక లే అవుట్లు వెలిశాయి. అయితే వీటిల్లో 90 శాతం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని లేఅవుట్ వెరిఫికేషన్ ఆఫీసర్(ఎండీఓ, మునుగోడు) ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గ్రామ పంచాయతీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతులు పొందలేదని స్పష్టం చేశారు. కనీసం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే లేఅవుట్లు వేశారని తేల్చారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. డ్రైనేజీ, ప్లాంటేషన్, విద్యుత్తు సదుపాయం వంటివేవీ కల్పించకుండానే ప్లాట్లను విక్రయించారు. ప్రధానంగా రాచకొండ, కంకణాలగూడెం, కొత్తగూడెం, సర్వేల్, కోతులాపురంల్లోని లేఅవుట్లల్లో చాలా వరకు నిబంధనలను ఉల్లంఘించినవేనని లెక్క తేల్చారు. బినామీలకు పట్టాలు....రాచకొండ పంచాయతీ పరిధిలో సర్వే నెం.273లో జహీరున్నీసా బేగం పేరిట ఉన్న 83.63 ఎకరాలు సరెండర్ చేశారు. సీసీ నెం.3771/75 ప్రకారం కొందరు రైతులకు అసైన్డ్ చేశారు. ఇంకా 53.80 ఎకరాలే మిగిలే ఉంది. ఐతే పట్టాలు పొందిన రైతుల్లో ముగ్గురు అసలు కనిపించడం లేదు. అంటే బినామీల పేరిట ఇచ్చారని తెలుస్తోంది. అంటే 15 ఎకరాల అక్రమంగా కట్టబెట్టారు. పాసు పుస్తకాలు జారీ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. తాసిల్దార్ మాయాజాలం...ర్వే నెం.106లో ఒకప్పుడు 559.03 ఎకరాలు దస్తగర్ద అనే క్లాసిఫైడ్‌తో ఉండేది. కాస్రా పహాణిలో పట్టా అని పేర్కొన్నారు. ఈ క్రమంలో పట్టాదారులు 74.35 ఎకరాలను సర్‌ప్లస్ కింద సరెండర్ చేశారు. అలాగే బిట్ నెం.106/11 నుంచి 106/14లోని 79.38 ఎకరాలు ఖరీజ్‌ఖాతా(ప్రభుత్వ భూమి)గా మారింది. ఈ సర్‌ప్లస్ ల్యాండ్‌లో 74.35 ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. ఐతే మొత్తంలో సర్‌ప్లస్, ప్రభుత్వ భూమి పోగా మిగతా భూమిని అప్పటి తహసీల్దార్ జగదీశ్వర్ రెఫరెన్స్ నెం.బీ/874/2007, తేదీ. 21.05.2007న పట్టాగా ధృవీకరించారు. ఐతే అందులోనే రియల్టర్లు 49.19 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ సర్వే నెం.106లో అమ్మకాలు, కొనుగోళ్లు ఎంత వరకు జరిగాయన్న దానిపై విచారణ చేయాలి. దాంతో రియల్టర్ల చేతుల్లోకి ఎంత వరకు ప్రభుత్వ భూమి, సర్‌ప్లస్ భూమి వెళ్లిందో గుర్తించడానికి డీమార్క్ చేయాలి. తహసీల్దార్‌కు పట్టా భూమిగా నిర్ధారించే అధికారం లేదు. పై స్థాయి అధికారికి మాత్రమే ఉంటుంది. కానీ సదరు తహసీల్దార్ అస్పష్టమైన సర్టిఫికేట్‌ను జారీ చేసినందున ఆయనపై చర్య తీసుకోవాలి. సర్వే నెంబర్లే మారాయి....సర్వే నెం.43లో సర్‌ప్లస్‌గా 31 ఎకరాలు ఉంది. దాన్ని భిన్నమైన సర్వే నెంబర్లుగా అంటే 43/ఈఏ మాదిరిగా మార్చారు. పూర్తిగా ప్రభుత్వానిదిగా ఉన్న దాంట్లోనే రియల్టర్లు రహదారి వేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ భూమిని పొందిన పేదలకు నేటి వరకు పొసెషన్ ఇవ్వలేదు. రియల్టర్లు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. బీ/2113/2008, బీ/927/2008, బీ/836/2000 డాక్యుమెంట్ల ద్వారా 246 మంది పేదలకు భూములు ఇచ్చారు. మహమ్మదాబాద్, రాచకొండ, నారాయణపురం గ్రామాలకు చెందిన వారున్నారు. ఐతే ఇందులో బీ/2113/2008 రికార్డు కార్యాలయంలోనే లేదు. అంటే దీని ద్వారా అనర్హులకు పట్టాలు ఇచ్చారని గుర్తించారు. అందుకే బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. చచ్చిపోయిన వారి పేర సంతకాలు....సర్వేల్‌లో సర్వే నెం.276, 277లో పట్టాదారులు చనిపోతే వారి కుటుంబ సభ్యులను పట్టాదారులుగా చూపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చనిపోయిన వ్యక్తుల పేరిట ఇతరుల చేత సంతకాలు పెట్టించుకొని రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో జారీ చేసిన పట్టా పాసు పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను రద్దు చేయాలని జేసీ సిఫారసు చేశారు. రాచకొండలో సర్వే నెం.273/ఈ2లో 45 ఎకరాల స్థలాన్ని ఆర్‌ఓఆర్ సర్టిఫికేట్ నెం.సి/3011/2000ను జారీ చేశారు. ఫైల్ నెం.డి/1723/2001 ద్వారా తహసీల్దార్ వ్యాల్యూయేషన్ సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా రియల్టర్లు చూపిస్తున్నారు. కానీ సదరు నెంబరు ద్వారా ఒకరికి కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం విశేషం. దీని ద్వారా బోగస్ పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేసినట్లు రుజువైందని జేసీ అభిప్రాయపడ్డారు. సర్వే నెం.40లోనూ 10.19 ఎకరాలకు బోగస్ పట్టాదారు పుస్తకాన్ని జారీ చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు తేలింది. రికార్డుల ట్యాంపరింగ్....సర్వే నెం.273/6లో 128.35 ఎకరాలకు సంబంధించిన భూమిలో అనేక రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ తేల్చారు. దీని ద్వారా రియల్టర్లకు 13-బీ సర్టిఫికేట్ ఇచ్చినట్లు గుర్తించారు. (13 బీ అంటే సాధారణ పత్రాలపై కొనుగోలు చేసిన వారికి ఆర్‌ఓఆర్ ద్వారా విచారణ చేసి, కొనుగోలు చేసిన నాటి రిజిస్ట్రేషన్ విలువను వసూలు చేయడం ద్వారా పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం). 2001 నుంచి జరుగుతోన్న అనేక అవకవతకలకు ఆ కాలం నుంచి పని చేసిన రెవెన్యూ అధికారులే బాధ్యులుగా పేర్కొన్నారు. నోటీసులు జారీతో చేతులు దులిపేసుకున్న వైనం...రాచకొండ సర్వే నెం.273/6లో జారీ చేసిన 13 బీ ధృవీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగాయి. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు జాయింట్ కలెక్టర్ పూనుకున్నారు. ఈ మేరకు వారికి 2008 డిసెంబర్ 15న షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలకు అసైన్ చేసిన భూములకు ఇకనైనా పొసెషన్ చూపిస్తే సినిమా సిటీని నిర్మించడం ద్వారా భూ సేకరణ జరిపితే వారికి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: