ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే ప్రజాస్వామ్యవాదులకు నిరాశానిస్పృహలు కలుగక మానవు. ఎక్కడ సందు దొరికితే అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రతిపక్షం.. విపక్షం ఏం మాట్లాడినా ఎదురుదాడితో సరిపెట్టేయవచ్చని అధికారపక్షం భావిస్తుండటం వల్ల.. అసలైన చర్చలకు అవకాశం లేకుండా పోతోంది. అసలే అసెంబ్లీ జరగాలని నిర్ణయించింది కేవలం ఐదురోజులు.. అందులోనూ మొదటి రోజు సంతాపతీర్మానాలతో సరిపోయింది. మిగిలిన నాలుగు రోజులైనా చర్చ సజావుగా సాగుతుందా అంటే అదీ లేదు.                                విపక్షనేత జగన్.. సంతాప తీర్మానం సమయంలోనూ.. తనకు ముందు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దాన్నో ఇష్యూ చేశారు. సజావుగా సాగాల్సిన తొలిరోజు కూడా వివాదానికి దారి తీశారు. ఇక రెండో రోజు.. హుద్ హుద్ తుపానుపై చర్చ సందర్భంగా జరిగిన రభస.. సభ సాగనీయకుండా ఇరుపక్షాలు చేసిన రగడ.. టీవీ ముందు కూర్చుని తమ సమస్యలు చర్చిస్తారేమో అని ఎదురుచూసే ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా విపక్షం ఎలాంటి విమర్శ చేసినా సరే.. ఎదురుదాడి చేసి వైఎస్ పాలనను, జగన్ అవినీతి చరిత్రను తిట్టిపోస్తే చాలు.. అన్న భావన అధికార పార్టీ మంత్రుల్లోనూ, సభ్యుల్లోనూ కనిపిస్తోంది.                               ఫీజు రీఎంబర్సు మెంట్ పై వైకాపా సభ్యుడు అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు.. వైఎస్ హయాం అంతా దుష్టపాలన..దోచుకుతిన్నారు.. అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఇక మరోమంత్రి.. అచ్చెన్నాయుడైతే ఏకంగా.. కోర్టు తీర్పులను కూడా వక్రీకరిస్తూ మాట్లాడారు. జగన్ కు కోర్టు వాయిదా ఉంటే.. జగన్.. అసలు అసెంబ్లీలో కూర్చోవడానికే అనర్హుడని కోర్టు చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు.                         ఈ ఓవరాక్షనే వివాదానికి దారి తీసి సభ వాయిదా పడేలా చేసింది. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో అటు వైకాపా సభ్యులు రెచ్చిపోయారు. వారిని చూసి టీడీపీ సభ్యులూ గొడవ చేశారు. మీ నాయకుడే దొంగ అని ఒకరంటే.. మీ నాయకుడిని మించిన 420 ఇంకెవడూ ఉండడు.. అంటూ మరొకరు తిట్లు లంకించుకున్నారు. అది అసెంబ్లీనా చేపలామార్కెట్లో అర్థంకాక పాపం.. సభాపతి స్థానంలో కూర్చున్న మండలి బుద్దప్రసాద్ బిత్తరపోయి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. మరి మిగిలిన మూడు రోజులైనా చర్చ సజావుగా సాగుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: