ఆంధ్రా రాజకీయాల్లో భలే వింత పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలకు తప్ప మూడో పార్టీకి స్థానమే లేకుండాపోయింది. బీజేపీ ఉన్నా.. అదికాస్తా మిత్రపక్షం కావడంతో చిన్నాచితకా పార్టీల్లేకుండా పోయాయి. మరోవైపు బీజేపీ కూడా కేవలం టీడీపీ తోకపార్టీలా కాకుండా స్వతంత్ర్యంగా ప్రాభవం పెంచుకోవాలని ఆశపడుతోంది. ఏపీలో దాదాపుగా చచ్చిపోయిన కాంగ్రెస్ నుంచి నేతల వలసలను ప్రోత్సహిస్తూ.. బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.                     ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్షనేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు.. ప్రతిపక్షనేత జగన్ తో వ్యక్తిగతంగా భేటీ కావడం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు వ్యవహారం కాస్త తేడాగానే ఉంది. హుద్ హుద్ తుపాను విషయంలో వైకాపా తీరు సరికాదంటూ ఈయన మాట్లాడారు. ఆ తర్వాత సభలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ పై ప్రశంసలవర్షం కురిపించారు. కొద్ది నిమిషాల తేడాతోనే భిన్నవైఖరులు ప్రద్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.                          శాసనసభలో చర్చ తర్వాత విష్ణుకుమార్ రాజు జగన్ క్యాబిన్లోకి వెళ్లి పదినిమిషాలసేపు భేటీ అయ్యారు. ఆ సమయంలో వైకాపా నేతలు కూడా అక్కడే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత విలేకర్లు ఏంటి కథ అని రాజును అడిగితే.. అబ్బే మర్యాదపూర్వకంగానే కలిశానంటూ రొటీన్ డైలాగ్ వినిపించారు. మరి ఇది సాధారణ భేటీయేనా.. లేక కొత్తరాజకీయ సమీకరణాలేమైనా చోటు చేసుకుంటాయా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: