హుదూద్ తుపానుపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో టిడిపి సభ్యుల సభా సమన్వయాన్ని ఆ పార్టీ అధినేత అభినందించినట్టు తెలిసింది. వైఎస్‌ఆర్‌సిపి సభ్యుల ఆరోపణలను ప్రత్యారోపణలు చేయడానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం ఏం చేసిందో కూడా విడమరిచి చెప్పడం ద్వారా ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వగలిగామని, ఈ విషయంలో విపక్షాన్ని ఇరుకున పెట్టగలిగామని టిడిపి నేతలు అధినేతకు వివరించినట్టు సమాచారం. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ వెళ్లడంపై కూడా విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి నిలదీయడంతో దానికి కూడా తాము సరైన రీతిలో సమాధానం చెప్పగలిగామని గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వివరించారు.  కాగా శనివారం రుణ ఉపశమన పథకంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఎలాంటి సమన్వయం సాధించాలనేదానిపై కూడా టిడిపి నేతలు చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా 2817 కిలోమీటర్ల పాదయాత్ర, రైతుల సమస్యలను గమనించడం, అధికారంలోకి వచ్చాక తీసుకోవల్సిన చర్యలు, రైతు రుణ ఉపశమన పథకాన్ని ప్రకటించిన తీరు గురించి కూడా చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్త రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే విపత్తులకు 9 జిల్లాల వరకూ గురవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: