ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎలివేటెడ్ కారిడార్లు, 11 చోట్ల స్కైవేస్, మల్టి లెవల్ గ్రేడ్ సపరేటర్స్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్, రవాణా రంగ కన్సల్టెంట్లతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జటిలంగా మారుతుందని, ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రధాన రహదారులపై 11 చోట్ల స్కైవేలు, ప్రధాన జంక్షన్ల వద్ద మల్టి లెవల్ గ్రేడ్ సపరేటర్స్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి సమగ్ర నివేదికతో ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రవాణా కన్సల్టెంట్లు కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు పెట్టారు. నగరంలో బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్‌నస క్రమబద్ధీకరించేందుకు, సిగ్నల్స్ కోసం ఎదురుచూడకుండా మల్టిలేవల్ గ్రేడ్ సపరేటర్స్‌ను నిర్మించే అంశంపై అధికారులు వివరించారు. ఇలా ఉండగా, నగరంలో 11 చోట్ల స్కైవేలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్ వరకు, మాసాబ్ ట్యాంక్ నుంచి హరిహర కళా భవన్ వరకు, నాగార్చున సర్కిల్ నుంచి మాదాపూర్ వరకు, తార్నాక నుంచి ఇసిఐఎల్ క్రాస్ రోడ్ వరకు, చార్మినార్ నుంచి బిహెచ్‌ఇఎల్ వరకు స్కైవేలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. స్కైవేలకు ఎక్కడైనా మెట్రోరైలు మార్గం అడ్డు వచ్చినట్టు అయితే అక్కడ వాటి పై నుంచి స్కైవేలను నిర్మించాలని అధికారులు సూచించారు. నరగంలో సుమారు 30 నుంచి 40 చోట్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని సిఎం అన్నారు. ఒక్కసారి సిగ్నల్ పడితే వందలాది వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉండటంతో ప్రధాన జంక్షన్ల వద్ద ఆకాశంలోనే సపరేటర్స్‌ను నిర్మించాలని, అభివృద్ధి చెందిన చాలా దేశాలలో మల్టి లెవల్ గ్రేడ్ సపరేటర్స్ ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. ఎల్‌బి నగర్, ఉప్పల్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, సెక్రటేరియట్, అంబేద్కర్ సర్కిల్, నక్లెస్‌రోడ్, అబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఒవైసి హాస్పిటల్, తిరుమలగిరి, ఆర్టీసి క్రాస్ రోడ్, సంగీత్, పారడైజ్ తదితర జంక్షన్ల వద్ద మల్టి లెవల్ గ్రేడ్ సపరేటర్స్ నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అథిగమించేందుకు ప్రతిపాదనలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: