వై.ఎస్. జగన్ మీద ఉన్న కేసుల సంగతి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేశాడని టీడీపీ ఇప్పటికీ అంతెత్తున ఎగిరిపడుతుంటుంది. పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారని సీబీఐ కూడా తమ చార్జ్ షీట్లలో పేర్కొంది. మరికొందరికి అప్పనంగా భూములు కట్టబెట్టి.. అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి డబ్బువరద పారించారని కూడా సీబీఐ చెబుతోంది. అందుకోసం వై.ఎస్. ఆనాడు అన్ని వ్యవస్థలనీ భ్రష్టుపట్టించారని అప్పట్లో టీడీపీ తెగ ఆరోపించింది.                                    అదంతా ఫ్లాష్ బ్యాక్..ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. జగన్ అధికారం దక్కక ప్రతిపక్షంలో కూర్చొన్నాడు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే వకాల్తా పుచ్చుకునే బాధ్యత నెత్తికెత్తుకున్నాడు. మరి జనం తరపున మాట్లాడాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా.. అందుకే.. ఎస్సీఎస్టీ నిధుల అంశాన్ని పట్టుకున్నారు. ఎస్సీఎస్టీ నిధులు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను సామాజిక కార్యకర్తలుగా నియమించుకుని వారి సిఫార్సు ఉన్న వారికే పింఛన్లు ఇస్తున్నారని విమర్శించారు. దయచేసి..ఇలా అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించవద్దని వేడుకుంటున్నానన్నారు.                                జగన్ విమర్శలపై టీడీపీ కూడా అదే రేంజ్ లో ఫైరయ్యింది. వ్యవస్థలను భ్రష్టుపట్టించిన జగనే.. ఇప్పుడు అలా చేయొద్దంటున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ తీరు చూస్తే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతే.. తాము వాటిని బాగు చేస్తున్నామని బిల్డప్ ఇచ్చేశారు. ప్రభుత్వ తీరును జగన్ విమర్శించడం వరకూ కరెక్టే కానీ.. మరీ ఇలాంటి భారీ డైలాగులు కొట్టడం అంత బావుండదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: