ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలుపుకుని అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌(నలుగురు), టిడిపి(ముగ్గురు), బిఎస్సీ(ఇద్దరు), వైసిపి (ఒకరు) ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారంతా బంగారు తెలంగాణ కోసం టిఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. వారితో కలుపుకుని అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌ బలం 73కు చేరుకుంది. శాసనమండలిలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీలతో కలుపుకుని టిఆర్‌ఎస్‌ సొంతబలం ఆరుగురు. ఇద్దరు పిఆర్‌టియు, ఐదుగురు టిడిపి, తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారితో కలుపుకుని 22 మంది ఎమ్మెల్సీలయ్యారు. శాసనసభ, శాసనమండలి నుంచి మంత్రివర్గంలో పద్దెనిమిది మందికి అవకాశం లభించింది. అందులో శాసనమండలి నుంచి ఇద్దరు(నాయిని నర్సింహారెడ్డి, మహమూద్‌ అలీ) మంత్రులయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా శాసనమండలి నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆరుగురు కాబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వచీప్‌, విప్‌లుగా ముగ్గురు, సాంస్కృతిక ఛైర్మన్‌గా ఒకరు నియమించబడ్డారు. 73 మంది ఎమ్మెల్యేల్లో 25 మందికి పదవులు లభించాయి. ఇంకా ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు, అసెంబ్లీ కమిటీలు, అసెంబ్లీ స్టాండింగ్‌ కమిటీలు, దేవస్థాన కమిటీలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నంటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన అధికార పార్టీలో ఉన్నవారిలో చాలామందికి పదవులు లభించడం ఖాయమని తెలుస్తోంది.  కొండా దంపతులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుసుకున్నారు. మంత్రివర్గంలో స్థానం లభిస్తుందన్న ఆశతో కొండా సురేఖ ఉన్నారు. కానీ చివరి సమయంలో రాకపోవడంతో ఆమె నిరాశకు గురయ్యారు. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల ఆమె కెసిఆర్‌ను అడిగినట్లు తెలిసింది. పదవి రాలేదన్న దానికంటే ఇతర పార్టీలో ఉన్న నేతల ఒత్తిడితో తనకు మంత్రి పదవిని నిరాకరించారన్న ప్రచారం జరుగుతోందని, దీనివల్ల స్థానికంగా ఏ రకంగా పార్టీని అభివృద్ధి చేయగలుగుతానని ప్రశ్నించినట్లు తెలిసింది. నియోజకవర్గం మారినా పార్టీ ఆదేశంతో వేరేచోట నుండి పోటీ చేసి గెలిచానని, ఇంతకంటే తనకేమీ కావాలని అన్నారని సమాచారం. అలాంటిదేమీ లేదని, అయినా కార్పొరేషన్‌ పదవుల్లో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యతలను మంత్రి కెటిఆర్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలోజరిగే ప్లీనరిలో పార్టీ బాధ్యతలను కెటిఆర్‌కు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని టిఆర్‌ఎస్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే పూర్తిగానే అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులుగా నియమించుతారా? అన్నది తెలియదు అని కొంతమంది నేతలు అంటున్నారు. కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని గతంలోనే చర్చలు జరిగాయి. దీనిపై ఏ వింగ్‌లోనూ చర్చించలేదని తెలిసింది. తాజాగా ప్లీనరికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో కెటిఆర్‌ పేరు చర్చల్లోకి రావడం గమనార్హం. పార్టీ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగిస్తే, ప్రభుత్వ బాధ్యతలు ఇంకొకరికి ఇస్తారా అని చర్చలు నడుస్తున్నాయి. వైద్యం కోసం అమెరికా వెళ్లడానికి కంటే ముందుగానే కెసిఆర్‌ ఈ కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: