బాబు వస్తారు..జాబులు ఇస్తామన్నారు...ఏవి జాబులు అంటూ వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడు శాసనసభలో నిలదీశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీల క్రమబద్ధీకరణ అంశంపై వైఎస్‌ఆర్‌సిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించగానే వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ అంశంపై సభలో చర్చ జరగాలని, లేదా సంబంధిత మంత్రితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాల విషయంలో కొత్తసంప్రదాయాలు వద్దని, చాలా ముఖ్యమైన ఈ అంశంపై వేరే రూపంలో వస్తే తప్పకుండా తాను చర్చకు అవకాశం ఇస్తానని స్పీకర్ కోడెల చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా దీనిపై చర్చ సాధ్యం కాదని స్పష్టంచేశారు. అయితే వైఎస్‌ఆర్‌సిపి నేతలు మాత్రం చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతూ పోడియంను చుట్టుముట్టారు.  సభను జరగనివ్వకుండా అరాచకవాదులుగా మారితే చరిత్రహీనులు అవుతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించడంతో వైఎస్‌ఆర్‌సిపి నేతలు పోడియం వద్ద పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా అని అన్నారు. కార్మిక మంత్రి అచ్చన్నాయుడు జోక్యం చేసుకుంటూ సభా సమయాన్ని వృథా చేయవద్దని, ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో సానుకూలంగా ఉందని అన్నారు. ఆనాడు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఆ పార్టీకి దగ్గరున్న వారికి ఇచ్చారని, వారిని రెగ్యులరైజ్ చేయమని ఇపుడు అడిగితే ఎలా చేస్తామని అన్నారు. ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని వేశారని, మార్గదర్శకాలు రూపొందించాక, అందరికీ న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏ అంశంపైనైనా నోటీసు ఇవ్వాలని, ప్రభుత్వం దానికి బదులు ఇస్తుందని, వాయిదాతీర్మానాలకు ప్రకటన చేయమంటే ఎలా అని యనమల నిలదీశారు. కాంట్రాక్టు ఉద్యోగుల జాబులు ఏమీ పోవని కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: