తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. అప్పట్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీ నుండి మద్దతు తీసుకుని వర్గీకరణ చేసుకున్నా కోర్టు అడ్డుకోవడంతో అది ఆగిపోయింది. అయినప్పటికీ మందకృష్ణ బాబుకు నమ్మకంగానే ఉంటున్నాడు. తెలంగాణలో ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ పాదయాత్ర చేయలేని పరిస్థితులలో మందకృష్ణ ఎమ్మార్పీఎస్ ను తెలంగాణలో వెంట నడిపించి పాదయాత్ర పూర్తి చేయించాడు. బాబును అడ్డుకునేందుకు వచ్చిన తెలంగాణ వాదుల మీద ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అయితే రాష్ట్ర విభజనతో మందకృష్ణకు చిక్కులు వచ్చిపడ్డాయి. తెలంగాణలో మాదిగలు అధికం. సీమాంధ్రలో మాలలు అధికం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మందకృష్ణ మొదటి నుండి అనేక ఆరోపణలతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అయితే ఎవరూ అడగకుండానే శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేయించి కేసీఆర్ మందకృష్ణకు చెక్ పెట్టాడు. ఇప్పుడు కేసీఆర్ ను మందకృష్ణ డిమాండ్ చేయడానికి ఏ అంశమూ లేకపోగా ..పలు మార్లు తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వచ్చింది.  కానీ సీమాంధ్రలో మాత్రం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం పెట్టే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికే మూడు రోజుల సమావేశాలు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది ఒక్క రోజు మాత్రమే. అయినా ఇంతవరకు వర్గీకరణ ఊసు లేదు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి చంద్రబాబుకు అండగా ఉన్న మందకృష్ణకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. ఇక హైదరాబాద్ లో దళితభవన్ కు కేసీఆర్ శంకుస్థాపన చేయడమే కాకుండా నిర్మాణానికి నిధులు కూడా విడుదల చేశాడు. దీంతో మందకృష్ణ చర్యలపై తెలంగాణలో తిరుగుబాటు మొదలయింది. ఇక్కడ ఆయనకు ప్రత్యామ్నాయమంగా దళిత ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి. మాదిగలను మందకృష్ణ తన సొంత ఎదుగుదలకు, ఆర్థికంగా బలపడడానికి వాడుకుంటున్నాడు అన్న ఆరోపణలతో వారు ముందుకెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మాదిగలకు తన వాదనను సమర్ధించుకునేందుకు కనీసం చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తాడు అనుకుంటే అది చేయకపోగా మాలల ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒకప్పుడు వర్గీకరణను వైఎస్ ద్వారా వర్గీకరణను అడ్డుకున్న ఎంఎల్ సీ జూపూడి ప్రభాకర్ రావును టీడీపీలో చేర్చుకోవడంతో మందకృష్ణ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అయితే సీమాంధ్రలో మాలల మద్దతు అవసరం నేపథ్యం గుర్తించి చంద్రబాబు మందకృష్ణకు హ్యాండిచ్చి జూపూడిని దగ్గరకు తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉన్నాడు మందకృష్ణ. మాదిగలకు మద్దతు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకించే జూపూడిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని, చంద్రబాబు జగన్ పార్టీ నేతలు సిద్దాంతపరంగా విమర్శిస్తే జూపూడి వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారని, అలాంటి వ్యక్తిని చేర్చుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మందకృష్ణకు బాబు సమాధానం ఇవ్వడని, ఆ దిశగా ఆలోచన కూడా చేయడని కూడా అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మందకృష్ణ ఏం సమాధానం చెప్పుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: