తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. మిషన్ కాకతీయ పేరుతో ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఐతే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. మరి వాటిని సమీకరించడం ఎలా.. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ఎన్నారైల నుంచి నిధులు విరాళంగా సేకరించాలని భావిస్తోంది. ఈ మహా యజ్ఞానికి తెలంగాణ ఎన్నారైలు ముందుకు రావాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నారైలు తమ గ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకోని నిధులు సమకూర్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. అలా చేస్తే.. ఆ చెరువుకు వారు కోరిన పేరు పెడతామని ఆఫర్ ఇచ్చారు.                                      జనవరిలో ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభమవుతుందని... ఎన్నారైలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతానని హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎన్నారైలకు ఓ లేఖ రాశారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, దుబాయి, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇలా ఆయా దేశాల్లో నివసిస్తోన్న తెలంగాణ వాసులకు, సంఘాలను ఉద్దేశిస్తూ హరీశ్ ఈ లేఖ రాశారు. తెలంగాణ ఆర్థిక,సాంస్కృతిక జీవనానికి ఆధారాలుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ గత పాలకుల కారణంగా విధ్వంసమైందని లేఖలో పేర్కొన్నారు.                           గత పాలకుల నిర్లక్ష్యం వల్ల.. చెరువులు కబ్జాలబారిన పడి అన్యాక్రాంతమయ్యాన్న హరీశ్... ఈ విధ్వంసం వల్ల తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయని..వలసలకు, ఆత్మహత్యలకు నిలయంగా మారాయన్నారు. గోదావరి బేసిన్ లో 175 టీఎంసీలు, కృష్ణాబేసిన్ లో 90 టీఎంసీలు...మొత్తం 265 టీఎంసీలు చిన్న నీటి వనరుల కేటాయింపులున్నాయన్నారు. కాని తెలంగాణలో చిన్న నీటి వనరుల వినియోగం కేవలం 90 టీఎంసీలకే పరిమితమయిందని వివరించారు. చెరువులను పునరుద్ధరించుకోవడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయికి పెంచుకోవాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎన్నారైలు చెరువులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు లేఖలో వివరించారు. మరి ఈ హరీశ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో.. మరికొద్దినెలల్లో తేలిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: