వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టున్నాయి. టీడీపీ జోరుగా ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తుండటంతో.. ఆ పార్టీలోకి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. నిన్నటికి నిన్న జూపూడి ప్రభాకర్ రావు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన అసెంబ్లీ సమావేశాల సమయంలో చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.                               బొడ్డు భాస్కర రామారావు టీడీపీలో చేరడం ఇక లాంఛనమే. మంగళవారం ఆయన టీడీపీలో చేరతారట. ఆయనతో పాటు ఇటీవలే వైకాపా నుంచి బయటికొచ్చిన కొణతాల రామకృష్ణ, గండి బాజ్జీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమంటున్నారు. ఐతే ఈ వలసలు ఇటు టీడీపీలోనూ కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చిన వారినందరినీ పార్టీలో చేర్చుకుంటూ పోతే.. కాంపిటీషన్ పెరిగిపోతుందని వారు ఫీలవుతున్నారు.                         ఐతే.. ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లు తక్కువగానే ఉన్నా.. ఈసారి పునర్వవస్థీకరణలో భాగంగా ఏపీ అసెంబ్లీ సీట్లు, కౌన్సిల్ సీట్లు పెరుగుతాయని.. అప్పుడు అందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం చేయవచ్చని పార్టీ వర్గాలు వారిని ఊరడిస్తున్నాయి. వైసీపీను దెబ్బకొట్టడమే ప్రస్తుతానికి ఉన్న ప్రధాన లక్ష్యం కాబట్టి.. వలసలకు అడ్డుచెప్పవద్దని వారికి సూచిస్తున్నాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ చేరికలు వైసీపీని ఇరుకున పెట్టేవే.

మరింత సమాచారం తెలుసుకోండి: