శాసనసభలో సోమవారం అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య తీవ్ర పరుష పదజాలం చోటు చేసుకుంది. ఒక దశలో ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీ ఎమ్మెల్యేపై దూసుకు పోవడంతో పరిస్థితి కొంత ఉద్విగ్నంగా మారిం ది. సోమవారం సభలో రుణ మాఫీపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ సభ్యుల తీరును అధికార పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి తప్పుబడుతూ మాట్లాడారు. ప్రతిపక్ష నేత నిన్నటి వరకు జైలులో ఉంటూ వెలుగుకు దూరంగా ఉన్నారని, ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో చూసి భరించలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. బుచ్చయ్యచౌదరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన రోజా శాసనసభలో రౌడీలా వ్యవహరిస్తున్నారని, ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటూ పరుష పదజాలాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంలోకి చొచ్చుకుపోయారు. తనను కించపరిచే విధంగా మాట్లాడారని స్పీకర్‌ పోడియం ముందుకు వెళ్ళిన రోజా స్పీకర్‌తో గట్టిగా వాదించారు. ఈ సందర్భంగా రోజా గద్గద స్వరంతో తనను కించపరిచే విధంగా మాట్లాడారని, అధికార పార్టీ సభ్యులు కావాలని తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రౌడీలా వ్యవహరిస్తున్నానని అన్నారు, ఏం రౌడీయిజం చేశానో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఒక దశలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఈ పరిస్థితుల్లో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సభను సజావుగా నిర్వహించేందుకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పలు పర్యాయా లు సభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో సభను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్‌ సభను వాయిదా వేసిన తర్వాత కూడా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరికి వారుగా వ్యక్తగత దూషణలకు దిగారు. ఒక సమయంలో రోజాతో సహా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు బుచ్చయ్యచౌదరిపైకి దూసుకు వెళ్ళారు. బయటకు వెళ్ళేం దుకు సిద్ధమైన తెదేపా సభ్యులు పలువురు అడ్డు రావడం, వైసీపీ ఎమ్మెల్యేలు రోజాను, చెవిరెడ్డిని వెనక్కు తీసుకు రావడంతో పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ, తెదేపా సభ్యులు పలువురు పరుష పదజాలంతో దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడంతో పాటు బయటకు పదా తేల్చుకుందామని సవాల్‌ విసురుకున్నారు. సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కాగానే తనను కించపరిచే విధంగా బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారని, ఇందుకు క్షమాపణ చెప్పాలని రోజా పట్టుబట్టగా, వైసీపీ ఎమ్మెల్యేలందరూ మద్దతు పలికారు. బుచ్చయ్యచౌదరి క్షమాపణ చెప్పేంత వరకూ సభను జరగనివ్వమని స్పష్టం చేశారు. వాస్తవానికి సభలో గందరగోళం జరిగిందని, ఎవరేం మాట్లాడారో తనకు వినిపించలేదని, తాను సభను సజావుగా నిర్వహించే అంశంపై దృష్టి కేంద్రీకరించినందున సభ్యులు మాట్లాడిన వ్యాఖ్యలను వినలేదని, ఎవరేం మాట్లాడారన్న విషయాలను రికార్డులను పరిశీలించి తెలుసుకుందామని, అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఇద్దరు సభ్యులు, భాజపా నుంచి ఒక సభ్యుడు కలిసి రికార్డులను పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తే ఆ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌కోడెల శివప్రసాదరావు హామీ ఇచ్చారు. సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు లేచి సభ జరుగుతున్న సమయంలో జరిగిన పరిణామాలు, సభ్యుల వ్యాఖ్యల తో పాటు సభ వాయిదా పడ్డ తర్వాత చోటు చేసుకున్న ఘటనలను కూడా పరిశీలించాలని సూచించారు. సభ వాయిదా పడ్డ తర్వాత కూడా కెమెరాలు 10, 15 నిమిషాలు పని చేస్తాయని, సభ వాయిదా పడ్డ తర్వాత జరిగిన ఏ సభ్యుడు ఎలా వ్యవహరించారు, ఏం మాట్లాడా రన్న విషయాలన్నీ కూడా ఉన్నాయన్నారు. సభలో గందరగోళం జరిగిన విషయం వాస్తవం మేం సభలో ఉన్నాం, అయినప్పటికీ గందరగోళంలో ఎవరేం మాట్లాడు తున్నారన్నది సరిగ్గా వినిపించ లేదని అన్నారు. రికార్డులన్నీ పరిశీలించండి తీర్పు ఇవ్వండి తప్పు జరిగిందని భావించి మీరు క్షమాపణ చెప్పాలని నిర్ణయిస్తే సభ్యుడు చెప్పాల్సిందేనని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేచి మహిళా ఎమ్మెల్యేను బుచ్చయ్యచౌదరి దూషించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: