రాజధాని బిల్లు, రుణమాఫీ... వీటిపై ఆంధ్రా అసెంబ్లీలో జరిగిన చర్చ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏపీలో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారంతా వీటిపై ఓ కన్నేశారు. కానీ సందట్లో సడేమియా అన్నట్టు వీటి మధ్యలో ఓ సవరణ సైలంట్ గా శాసనసభ ఆమోదం పొందింది. అది విమానాల ఇంధనాలపై పన్ను తగ్గింపు సవరణ. విమాన ఇంధనాలపై ఇప్పటివరకూ 16 శాతం పన్ను ఉంది. దీన్ని అమాంతం 1 శాతానికి తగ్గిస్తూ శాసనసభ సవరణను ఆమోదించింది. ప్రజారవాణాకు ఆయువు పట్టైన డీజిల్, పెట్రోల్ లపై ఏటా ఇంధన పన్నులు పెంచుతూ.. జనం నడ్డివిరిచే సర్కారు.. విమానాలపై పన్ను తగ్గించడం విమర్శలకు దారి తీస్తోంది. అందులోనూ కాస్తో కూస్తో తగ్గించడం కాదు.. ఏకంగా దాదాపు పన్ను మొత్తం ఎత్తేసినంత పని చేసేశారు. 16 శాతం ఉన్న పన్నును కేవలం ఒక్కశాతానికి పరిమితం చేశారు. మరి ఎందుకు విమానాలపై అంత దయ.. సాధారణ జనంపై లేని ప్రేమ ఎందుకు విమాన ప్రయాణీకులపై పుట్టుకొచ్చింది. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంది. విమాన ఇంధనాలపై పన్ను తగ్గించడం వల్ల.. విమాన రాకపోకలు విపరీతంగా పెరుగుతాయట. అది రాష్ట్రంలో విమానయానరంగానికి ఊపు ఇస్తుందట. ఎవరైనా అవసరం ఉంటే ప్రయాణం చేస్తారు కానీ.. పన్ను తగ్గించారు కదా.. అన విమాన ప్రయాణాలు పెట్టుకుంటారా అని ప్రతిపక్షనేతలు బుగ్గలు నొక్కుకుంటున్నారు. టికెట్ కొనుక్కోగలిగిన స్థోమత ఉన్నవారే విమానాల వైపు చూస్తారు. వారిపై ప్రేమ చూపించి.. సాధారణ ప్రయాణికుడిపై నడ్డి విరిచేలా పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారన్నది ఆంధ్రా సర్కారుకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: