అసెంబ్లీ అంటేనే రభస, రచ్చ అనే పదాలకు నానార్థంగా మారిపోయింది. మనం అధికారపక్షమైతే.. విపక్షాన్ని దొంగలు, అవినీతిపరులు, ఖూనీకోర్లు అనేద్దాం.. అదే మనం ప్రతిపక్షంలో ఉంటే.. సర్కారు జనాన్ని మోసం చేసేసింది. అంతా కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారు.. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్లే రైతులు చనిపోతున్నారని విమర్శించేద్దాం.. ప్రతిపక్షంలో ఉంటే.. సభ జరగనీయకుండా ఆందోళన చేద్దాం.. అదే అధికారపక్షంలో ఉంటే.. అధికారాన్నిఅడ్డుపెట్టుకుని.. సస్పెండ్ చేసేద్దాం.. ఇలా సాగిపోతోంది అసెంబ్లీలో పార్టీలు,నేతల తీరు..                              కానీ సోమవారం వీటికి భిన్నంగా ఓ ఎమ్మెల్యే సభలో ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎవరీ ఎమ్మెల్యే ఇంత సాధికారికంగా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఆయనే డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విపక్షం కదా అని చెప్పి.. ఊరికే ప్రభుత్వంపై విరుచుకుపడిపోకుండా.. కూల్ గా పాయింట్ బై పాయింట్ మాట్లాడారు. రాజధాని బిల్లులో ఉన్న లోపాలేంటి.. ఈ బిల్లు ఏ ఏ అంశాలను పట్టించుకోలేదు.. ఈ బిల్లు చెబుతున్న భూసమీకరణకు.. ఇటీవల కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టానికి తేడా ఏంటి..? రాజధాని జరీబు భూముల్లో పెట్టడం వల్ల నష్టాలేంటి.. అనే అంశాలను సోదాహరణంగా వివరించారు.                                సాధారణంగా విపక్షానికి చెందిన సభ్యులు కొద్దిసేపు ప్రసంగించగానే.. కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ అని స్పీకర్ వారి వెంటపడటం మామూలే.. ప్రతిపక్షనేతకు తప్ప.. అంత ఎక్కువ సమయం విపక్ష సభ్యులకు సాధారణంగా దక్కదు. కానీ సోమవారం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. దాదాపు గంటసేపు అనర్ఘళంగా మాట్లాడారు. ప్రశాంతంగా, సౌమ్యంగా.. అక్కడక్కడా కొటేషన్లు.. ఉదంతాలు, సామెతలు.. ఇలా బుగ్గన తడుముకోకుండా మాట్లాడుతుంటే.. అసెంబ్లీలో దాదాపు పిన్ డ్రాప్ సైలంట్ వాతావరణం నెలకొంది.                కేవలం రాజధాని అంశంపైనే కాదు.. చివర్లో వ్యాట్ బిల్లు సభలో ప్రవేశ పెట్టిన సమయంలోనూ.. అందులో లోపాలు ఎత్తిచూపి... అబ్బో.. ఈయన దగ్గర విషయముందిరోయ్.. అని అంతా అనుకునేలా చేశారు. ఏపార్టీకి చెందిన సభ్యులైనా సభకు వచ్చేముందు.. ఆ మాత్రం కసరత్తు చేస్తే.. అప్పుడే కదా అసెంబ్లీ సమావేశాలకు అర్థం..పరమార్థం.. ప్రజాస్వామ్యయుతమైన చర్చకు ఆస్కారం.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: