గతంలో ఓ వెలుగు వెలిగిన కామ్రేడ్లు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నారు. కాలం కలిసిరాక అస్థిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నాయకత్వ లోపం, అనైక్యత, ప్రజల్లో కొరవడిన విశ్వాసం ఆ పార్టీల మనుగడనే ఇబ్బందుల్లో పడేశాయి. భవిష్యత్-ను తీర్చిదిద్దుకునేందుకు ఎర్రదళాలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నా అవి ఆచరణలో కనిపించడంలేదు. వామపక్ష పార్టీలకు 2014 కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు. ప్రజా పోరాటాలకు ఎప్పుడూ ముందుండే ఎర్రసైన్యం ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నం చేస్తోంది. నాయకత్వ లోపం వామపక్షాలకు పెద్ద సమస్యగా మారింది. భూ పోరాటాలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరాటాలు చేసి ఉవ్వెత్తున ఎగిరిన ఎర్రజండాలు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తరువాత వామపక్షాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సమైక్య రాష్ట్రంగా ఉంచాలని సీపీఎం, ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా సీపీఐ వేర్వేరు అజెండాలతో సాగాయి. ఆతర్వాత రెండు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీల పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలకు ఏపీలో ఒక్క సీటు కూడా దక్కలేదు. తెలంగాణలో సీపీఎం తరపున ఒకరు, సీపీఐ తరపున ఒకరు గెలిచి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా వామపక్షాల పరిస్థితి తయారైంది. ఉద్యమాలే ఊపిరిగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈ సంవత్సరం ఉద్యమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయాయి. తెలంగాణలో అప్పుడప్పుడూ చాడ వెంకట్-రెడ్డి, తమ్మినేని వీరభద్రం వివిధ సమస్యలపై ధర్నాలకు దిగుతున్నా అవి ఏమంత ప్రభావశీలంగా లేవు. ఇక ఏపీలోనైతే సీపీఐ నేత రామకృష్ణ పోరుబాట కొనసాగిస్తున్నా సీపీఎం కార్యదర్శి మధు మాత్రం సీఎంకు లేఖలు రాయడానికే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. తెలంగాణ వామపక్ష నేతలు మీడియా సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తూనే మరో వైపు మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్-కు మద్దతుగా నిలిచారు.  తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచనదినంగా ప్రకటించాలని పోరాటాలు చేసిన సీపీఐ తీరా తెలంగాణ వచ్చిన తరువాత ఇదే అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ఏపీ విషయానికొస్తే అక్కడ లెఫ్ట్ పార్టీల జాడ కానరావడం లేదనేది ప్రజల అభిప్రాయం. రాష్ట్ర విభజన తరువాత విజయవాడలో ముందుగా రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసింది వామపక్షాలే అయినా ప్రజా పోరాటాలు చేయడంలో వెనుకబడ్డాయనే చెప్పుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఈ ఏడాది వామపక్ష పార్టీలు పనిచేయలేదనేది స్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: