రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులను చల్లారేలా చేయడానికి ఉపయోగించిన అస్త్రం ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం నష్టపోతున్న నేపథ్యంలో సీమాంద్ర సహిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. అలాంటి హోదాతో అక్కడికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా అభివృద్ధికి అవకాశం ఉంటుందని పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయి ఆరు నెలలు గడిచిపోయినా.. ఇంత వరకూ ప్రత్యేక హోదా గురించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై పడుతోంది. మోడీ మంత్రి వర్గంలో చక్రం తిప్పే శక్తిగల వ్యక్తిగా పేరున్న వెంకయ్య ఏపీకి ప్రత్యేక హోదా సాధించిపెడతాడని చాలా మంది ఆశలు పెట్టుకొన్నారు. అయితే ప్రస్తుతం ఈ మంత్రిగారి మాటలను బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా అనేది సాధ్యం అయ్యే పని కాదని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ వాళ్లు పోతూ పోతూ ప్రత్యేక హోదా తలనొప్పిని తగిలించి వెళ్లారని... ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని వెంకయ్య వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి వెంకయ్య ఈ విధంగా మాట్లాడుతున్నారంటే.. ప్రత్యేక హోదా అనే దానిపై ఆశలు వదులుకోవడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ వాళ్లు కాంగ్రెస్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది మేమిచ్చిన హామీ కాదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కావాలంటే వెళ్లి ఆ పార్టీ నేతలను నిలదీయండన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మాటలను బట్టి చూస్తే..ఏపీకి ప్రత్యేక హోదా హుళ్లక్కేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: