మళ్ళీ మరో విమానం! కూలి పోవడం కాదు, అదృశ్యం అయిపోయింది. మలేషియా విమాన కంపెనీ ఎయిర్ ఆసియా విమానం ఇండోనేషియా లోని రెండో అతి పెద్ద నగరం సురబాయా నుండి సింగపూర్ వెళ్తూ మార్గ మధ్యంలో జావా సముద్రంపై ఉండగా అదృశ్యం అయిపోయింది. ఎదురుగా ఉన్న మేఘాలను తప్పించేందుకు ఎడమ పక్కకు తిరిగి కాస్త పైకి వెళ్తామని పైలట్ అనుమతి కోరాడని, ఇంతలోనే విమానం రాడార్ నుండి అదృశ్యం అయిందని ఇండోనేసియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పారు. విమానంలో మొత్తం 162 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 155 మంది ప్రయాణీకులు కాగా మిగిలిన 7 గురు సిబ్బంది. తెల్లవారు ఝామున సురబయ లో బయలుదేరిన విమానం 42 నిమిషాల సేపు ప్రయాణించాక అదృశ్యం అయింది. మొత్తం ప్రయాణ కాలం 2 గంటల 10 నిమిషాలు. అనగా సగం దూరం కంటే తక్కువే విమానం ప్రయాణించింది. విమానం అదృశ్యం అయిన సమయానికి, ఆ చోటులో వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నదని ఇండోనేషియా వాతావరణ విభాగం వారు చెబుతున్నారు. కనుక వాతావరణం వల్లనే విమానం ప్రమాదానికి గురయి ఉండవచ్చని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగి ఇప్పటికే 12 గంటలు దాటిపోయింది. రాత్రి కావడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాల సిబ్బంది ప్రారంభించిన భారీ వెతుకులాట కార్యక్రమాన్ని ముగించి వెను దిరిగారని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. ది హిందూ పత్రిక ప్రకారం విమానం కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. ఎయిర్ ఆసియా కంపెనీ ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, ఇండియా లకు తన ప్రయాణాలను విస్తరించినట్లు తెలుస్తోంది. తక్కువ దూరం ప్రయాణాల పైననే ఈ కంపెనీ ప్రధానంగా కేంద్రీకరించి పని చేస్తోంది. దీర్ఘ కాలిక ప్రయాణాల లోకి ఇటీవలనే ప్రవేశించిందని కానీ పూర్తిగా అందులోకి దిగలేదని వివిధ పత్రికలు తెలిపాయి. అయితే విమాన పైలట్, కో పైలట్ లకు సుదీర్ఘ అనుభవం ఉన్నవారేనని ఎయిర్ ఆసియా కంపెనీ తెలిపింది. ఎయిర్ బస్ కంపెనీ నిర్మించిన A320 తరగతి విమానం అత్యంత దృఢమైనదిగా పేరు పొందిందని పశ్చిమ దేశాలకు చెందిన పైలట్ లు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. మార్చి 8 తేదీన అదృశ్యం అయిన బోయింగ్ 777 విమానం, ఉక్రెయిన్ పైన కూల్చివేయబడిన బోయింగ్ 777 విమానం కూడా అత్యంత దృఢమైన విమానాలేనని అప్పట్లో అనేకమంది పైలట్లు ప్రకటించారు. 298 మందితో ఉక్రెయిన్ లో కూలిన M17 విమానాన్ని ఉక్రెయిన్ సైనిక బలగాలే కూల్చాయి గనుక ఆ ప్రమాదానికి కంపెనీని వేలెత్తి చూపలేము. కానీ అదే తరగతి విమానం అయిన MH370, 239 మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెళ్తూ మార్గ మధ్యంలో ఎటువంటి సూచనలు విడువకుండా అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆ విమానం ఆచూకీ లేకపోవడం విమానయాన రంగంలో అతి పెద్ద మిస్టరీగా ఇప్పటికీ కొనసాగుతోంది. జావా సముద్రం పైన అదృశ్యం అయిన QZ8501 విమానం కోసం ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ లు భారీ అన్వేషణ మరియు రక్షణ కార్యకలాపాలను రోజంతా నిర్వహించాయి. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విమానం అదృశ్యం అయినట్లు తెలిసిన వెంటనే మూడు దేశాలు ఉమ్మడిగా రక్షణ చర్యలు ప్రారంభించాయి. C130 విమానాన్ని రంగంలోకి దించాయి. మరో C130 విమానాన్ని స్టాండ్ బై గా ఉంచుకుని అన్వేషణ జరిపాయి. కానీ చీకటి పడేవరకూ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. కానీ విమాన శకలాలుగా భావిస్తున్న శిధిలాలు జావా సముద్రంలో కనిపించాయన్న వార్త పత్రికల్లో షికారు చేస్తోంది. ఈ వార్తను అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు.  ఈ వార్త నిజమే అయితే ఒకే సంవత్సరంలో మూడో మలేషియా విమానం ప్రమాదానికి గురయినట్లవుతుంది. పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ల మధ్య చివరి సంభాషణ స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 6:13 కి జరిగిందని, “ముందున్న మేఘాలను తప్పించేందుకు ఎడమ వైపుకి తిప్పి 34,000 అడుగుల ఎత్తుకు ఎగిరేందుకు అనుమతి ఇవ్వండి” అని పైలట్ కోరారని ఇండోనేషియా రవాణా అధికారులు చెప్పారు. గం. 6:16 ని.ల కల్లా విమానం రాడార్ నుండి అదృశ్యం అయిందని వారు చెప్పారు. విమానానికి ఇండోనేషియా వ్యక్తి పైలట్ గా ఉండగా ఫ్రెంచి వ్యక్తి కో-పైలట్ గా ఉన్నారని తెలుస్తోంది. కొరియా, సింగపూర్, మలేషియా, యు.కె దేశాల వారు విమానంలో ఉన్నప్పటికీ అత్యధికులు ఇండోనేషియాకు చెందినవారే. సురబయ, సింగపూర్ విమానాశ్రయాల వద్ద ప్రయాణీకుల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని తమ వారి కోసం వాకబు చేస్తున్నారు. అనేకమంది విలపిస్తున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ ధైర్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు దేశాల అధినేతలు బాధితులకు ఓదార్పు ఇస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. వాతావరణం వల్ల అన్వేషణ నిలిపివేయడంతో ప్రయాణీకుల బంధువులకు ఓ కాళరాత్రి మిగిలినట్లే. దొరికాయని చెబుతున్న శిధిలాలు ప్రమాదం జరిగిన పాయింట్ కు 100 మైళ్ళ దూరంలో ఉండడంతో బంధువులు బిక్కు బిక్కు మంటూ భారంగా, విషాధంగా, భయంగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: