ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లూ రాష్ట్రానికి ఉన్న కొద్ది ఆశలూ ఆవిరైపోయాయి. ప్రత్యేక హోదా కింద నిధుల కేటాయింపుపై కూడా అనుమానాలు నెలకొ న్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు కనిపించ టంలేదు. అయినప్పటికీ అధికార టీడీపీ నాయ కులు, మంత్రులు మాత్రం ప్రత్యేక హోదా కింద రూ.వేల కోట్ల నిధులు వచ్చేస్తున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.ఈ నేపధ్యంలో సాక్షాత్తు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్‌ వ్యవ హారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై కేంద్రం ఆలోచనను బయట పెట్టేశారు. కేంద్రమే ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తేల్చి చెప్పారు. విజయ వాడలోని ఆంధ్రా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 'మేక్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై జరిగిన సదస్సుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటి నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక గ్రాంట్‌ విషయంలో విముఖంగానే ఉన్నారు. అయితే త్వరలోనే రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు రానున్నట్లు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఈ నేపధ్యంలో సుజనాకు కౌంటర్‌గా సీనియర్‌ మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై ఉన్న ఆశలను పటాపంచల్‌ చేసేశారు. దీనినిబట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం నుంచి పైసా కూడా రాదనే విషయం సుస్పష్టమవుతోంది. ప్రత్యేక హోదా కోరేకంటే రాజధాని నిర్మాణం, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి శాఖలవారీగా ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (సీఎస్‌)కు తానే సూచించినట్లు మంత్రి వెంకయ్యనాయుడే స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పే వెంకయ్యనాయుడే స్వయంగా అది సాధ్యపడదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. ఒకవైపు విజయవాడ - గుంటూరు మధ్య నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తోంది. రైతుల నుంచి సమీకరించిన భూమిలో కొంత భాగాన్ని రైతులకు ఇచ్చి, మిగిలిన భూమిలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే యోచనలో ఉంది. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయని సీఎం చంద్రబాబునాయుడు గంపెడాశ పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన తరచూ ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిసి వస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి పెట్టుబడులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై ఆశలు పెట్టుకోవద్దంటూ ఘాటుగా చెప్పటం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: