అయోధ్యలో రామాలయ వివాదం తెలిసిందే కదా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి రామాలయ వివాదం చోటుచేసుకుంటోంది. ఇది ఇంకా బయటపడనప్పటికీ తగవు ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లబోతోంది. రెండు రామాలయాల్లో ఎక్కడ అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలనే విషయంలో ఈ వివాదం రాజుకుంటోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రామాలయంగా వర్ధిల్లిన భద్రాచలంలోని రామాలయం ప్రస్తుతం తెలంగాణలో ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇంకో రామాలయాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న తలంపులో ఉన్నారు. అలా గుర్తించిన ఆలయంలోనే ఈసారి శ్రీరామనవమికి ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు జరపాలని భావిస్తున్నారు. కానీ ఏ ఆలయానికి ఆ అవకాశం ఇవ్వాలనే విషయంలో రాజకీయం చోటుచేసుకుంది.

రెండో భద్రాద్రిగా పేరున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విభజన తరువాత రాష్ట్రంలోని ప్రధాన రామాలయంగా గుర్తించాలని ఆ జిల్లా నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఒక దశలో అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. కానీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అడ్డు తగలడంతో ఒంటిమిట్ట ఆలయానికి ఆ గౌరవం దక్కుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒంటిమిట్లలోని పురాతన కోదండరామాలయం ప్రసిద్ధి గాంచిందే అయినప్పటికీ కేంద్ర మంత్రి అశోక్ సొంత జిల్లా విజయనగరంలోని రామతీర్థాలు ఆలయానికీ గొప్ప పేరుంది. రామతీర్థం ఆలయానికి ఆ గుర్తింపు ఇచ్చి...అక్కడ నవమి మహౌత్సవాలు నిర్వహించాలని ఆయన పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి గుర్తింపు కోరుతూ కడప జిల్లాలోని అన్నిపార్టీల నేతల మద్దతుతో ఆ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీఎంను కలుస్తారని సమాచారం.

ఒంటిమిట్ల ఆలయ చరిత్రను చంద్రబాబుకు వివరించి ఎలాగైనా ఇక్కడ కోదండ రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహ్మౌత్సవాలను నిర్వహించాలని కోరనున్నట్లు సమాచారం. మరోవైపు అశోక్ కూడా దీనిపై గట్టి పట్టుదలతో ఉన్నారని... రామతీర్థాలను మరో భద్రాద్రిగా మార్చేందుకు ఆయన సీఎంపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఈ సంకట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: