డ్వాక్రా సంఘాలకు రుణాల మాఫి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాయిదా వేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గడచిన ఎన్నికల సమయంలో అధికారంలోకి రావటం కోసం తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు మోయలేని భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అయితే, చంద్ర బాబు  రద్దు ల హామీలను నమ్మిన ప్రజలు టిడిపికి అనుకూలంగా ఓట్లు వేయటంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సమస్యలు మొదలైంది. ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చేందుకు చేసిన అలవికాని హామీలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే నెరవేర్చాల్సి రావటంతో చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో అసలే రూ. 16,500 కోట్ల లోటుతో మొదలైన ప్రభుత్వం రైతు, డ్వాక్రా రుణాల రద్దుకు సుమారుగా రూ. 90 వేల కోట్లను కేటాయించాల్సి వచ్చింది. లోటు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రానికి ఈ మొత్తంతో షాక్‌ తగిలింది. దాంతో రైతుల రుణాల రద్దుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించటం మొదలుపెట్టింది. రైతులకు రేషన్‌ కార్డులుండాలని, ఆధార్‌కార్డులుండాలని, ఒక కుటుంబానికి ఒకే రుణమని, అది కూడా లక్షన్నర రూపాయల వరకే తీరుస్తామని చెప్పారు. తీర్చదలచిన రుణం కూడా ఒకేసారి కాకుండా నాలుగు వాయిదాల్లో తీరుస్తామన్నారు.  నాలుగు వాయిదాల్లో తీర్చే రైతుల రుణాలకు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ఎవరు చెల్లిస్తారన్న విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విధంగా ఎవరికీ అర్ధం కాని రీతిలో, వీలైనంత తక్కువ భారం పడేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కసరత్తులు చేసింది. చివరకు ప్రభుత్వం తేల్చిన రైతు రుణమాఫీ మొత్తం రూ. 30 వేల కోట్లకు తగ్గిపోయింది. అదికూడా చివరకు హైదరాబాద్‌లో ఆధార్‌కార్డులు కలిగిన వారికి రుణమాఫీ పథకం వర్తించదని మళ్ళీ ప్రకటించింది. రూ. 50 వేల లోపు రుణాలున్న రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వర్తించదని ఒక వైపు చెబుతూనే ఇంకోవైపు వారికి కూడా వర్తింపచేయటం మొదలుపెట్టింది. ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అన్నది కొందరికి వర్తిస్తుండగా మరికొందరికి వర్తింపు కావటం లేదు. మొత్తం మీద రైతు రుణమాఫీ అన్నది ఒక బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. ఇపుడు ఆ పథకం అమలు గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు.ఈ నేపధ్యంలో 75 లక్షల డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రుణాలు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చంద్రబాబు హామీల మేరకు బ్యాంకులకు రుణాలు కట్టడం మానేసిన డ్వాక్రా సంఘాల నుండి బ్యాంకులు ముక్కు పిండి వాయిదాలు, చక్ర వడ్డీతో కలిపి వసూలు చేసుకోవటం మొదలుపట్టాయి. దాంతో మహిళా సంఘాలు గగ్గోలు మొదలుపెట్టాయి. దాంతో డ్వాక్రా రుణాలు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీర్చటం మొదలుపెట్టాలని ప్రభుత్వం అనుకున్నది. అయితే, కేంద్రం నుండి వస్తుందనుకున్న నిధులు రివాజుగా రావాల్సిన నిధులు కూడా ఇంత వరకూ రాలేదు. దాంతో రాష్ట్ర ఖజనా ఇబ్బందులో పడింది. దాంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్దం కాలేదు. ఈ పరిస్ధితుల్లో ఖజానా ఖాళీ అవుతుండటం, బయట నుండి నిధులు రాకపోవటంతో చంద్రబాబును సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దాంతో వేరే దారి లేక డ్వాక్రా రుణాలు, ఉద్యానవన పంటలకు చేయాల్సిన రుణమాఫీ ప్రక్రియను వాయిదా వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాకుండా, అత్యవసరం అయితే తప్ప ఏ విధమైన చెల్లింపులు చేయరాదని కూడా ఆర్దికశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాంతో ఎక్కడి చెల్లింపులు అక్కడే అగిపోయాయి. చెల్లింపుల వాయిదా ఎంత కాలం అన్నది ఎవరూ చెప్పలేకున్నారు. ఆర్ధికశాఖ పైకి బుకాయిస్తున్నా, వచ్చే నెలలో ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన జీత, బత్యాలకు కూడా నిధులు కష్టంగానే ఉన్నట్లు సమాచారం. జీతాలు, బత్యాలు కూడా ఇవ్వకపోతే ప్రభుత్వం పరువుపోతుంది. అందుకనే, అవకాశం ఉన్నంత మేరా అప్పులు తీసుకోవాలని, బాండ్లు అమ్ముకోవాలని ఆర్దికశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఆర్దికశాఖ ఉన్నతాధికారులు అదే పనిపై ఉన్నారు. ఆర్ధికశాస్త్రంలో నిపుణుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఈ సమస్యనుండి రాష్ట్రాన్ని ఏ విధంగా బయటపడేస్తారో చూడాలని పలువురు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: