తెలంగాణ రాక ముందే ట్యాంక్ బండ్ పై ఆంధ్రుల విగ్రహాలు కూలగొట్టిన సంగతి తెలిసిందే. దశాబ్దాల తరబడి తన చరిత్రకు అన్యాయం జరిగిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. ఇదంతా రాష్ట్రం విడిపోక ముందు. ఇక ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రుల చరిత్ర తెలంగాణవాసులు చదువుకుంటారా.. ఆ ప్రసక్తే ఉండదు. అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం కొత్త సిలబస్ రూపకల్పనకు కసరత్తు కూడా చేస్తోంది.  ఐతే.. ఇప్పుడు తెలంగాణ చరిత్రలో ఓ ఆంధ్రుడి ప్రస్తావన తప్పకుండా ఉండాలని కొందరు తెలంగాణవాదులు డిమాండ్ చేయడం విశేషం. అంతే కాదు.. ఆ ఆంధ్ర నాయకుడి విగ్రహం కూడా హైదరాబాద్ లో పెట్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రాలోనూ తెలంగాణను సపోర్ట్ చేసిన నాయకుడు ఎవరైనా ఉండుంటే.. అతని గురించి తెలంగాణవాదులు మాట్లాడుతున్నారని అనుకోవడం సాధారణమే. కానీ వీరు డిమాండ్ చేస్తున్నది ఓ సమైక్యవాది కోసం అని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.  ఆ సమైక్యవాదే లగడపాటి రాజగోపాల్.. లగడపాటి వంటి సమైక్యవాది చర్యల వల్లే.. తెలంగాణవాదులంతా ఏకమై తెలంగాణ సాధించుకున్నారని.. తెలంగాణ జనసంక్షేమ సంఘం అధ్యక్షడు వెంకటనారాయణ కోరుతున్నారు. ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిసి.. ఈమేరకు వినతిపత్రం అందజేశారు. లగడపాటి చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని.. లగడపాటి విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టాలని ఆయన కోరుతున్నారు. వినడానికి తమాషాగా ఉన్నా.. ఇది సాధ్యమయ్యే పనేనా..?

మరింత సమాచారం తెలుసుకోండి: