ఢిల్లి అసెంబ్లి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. ఆప్‌ నేత అర్వింద్‌ కేజ్రీ వాల్‌ సభలకు హాజరు అవుతున్న బారీ జన సందోహాలను చూసి ఒకింత కంగారు పడిన బీజేపీ రిస్కు తీసుకోకుండా దేశరాజధాని ఎన్నికల రణంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీ వెనుకబడకుండా ప్రచార తుదిఘట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీనియర్‌ నేతలు బేడీ తరఫున ప్రచారానికి అంతగా ఆసక్తి తీసుకోకపోవడం పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఆమెను పోటీకి నిలిపిన కృష్ణనగర్‌ నియోజకవర్గంలో అంతకు ముందు అయిదు సార్లు గెలుపొందిన కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ మంగళవారం ఎక్కడా ప్రచారంలో కనబడకపో వడం సందేహాలకు తావిస్తోంది. అంతకు ముందు జరిగిన ఒక ప్రచార సభలో బేడీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మనస్థాపం కలిగించాయంటున్నారు. ఇప్పటివరకు డాక్టర్‌ సాహిబ్‌ మీ మంచీచెడూ చూశారు. ఇకపై నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని బేడీ ఓబర్లకు చెప్పారు. దీంతో తమ నాయకుడి ప్రాధాన్యతను తగ్గించడమేనని హర్షవర్థన్‌ అనుయాయులు భావిస్తున్నారు. ఎంపీగా ఎన్నిక కావడానికి పూర్వం ఆయన వరుసగా అయిదు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చెప్పుకున్నారు. ఇక ఇతర పార్టీ నేతలు కూడా పార్టీలో చేరిన నాలుగు రోజుల్లోనే మాజీ పోలీసు అధికారిణి కిరణ్‌ బేడీని సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించడం ఇతర నేతలకు కూడా మింగుడు పడలేదు. దీంతో వారిలో కొంత నిరాసక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వాస్తవాలు గ్రహించిన అధినాయకత్వం వెంటనే కళ్లు తెరచి అరుణ్‌ జైట్లీని సీన్లోకి ప్రవేశపెట్టింది. కీలకమైన ఈ వ్యూహకర్తకు ప్రచార కార్యక్రమాలు సమన్వయం చేసే బాధ్యత అప్పగించింది. ఆయన ఢిల్లిd బీజేపీ ఆఫీసులో నిరంతరం సమావేశాలు ఆయా కార్యక్రమాలు సమన్వయం చేస్తున్నారు. బ్రహ్మాస్త్రంగా నరేంద్ర మోడీని కూడా ప్రయోగిస్తున్నారు. ఆయన వచ్చే కొద్ది రోజుల్లో నాలుగు ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేస్తారు. రానున్న పది రోజుల్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి 11 మంది కేంద్రమంత్రులు, 17 మంది ఎంపీలను కూడా ప్రచారంలోకి దింపారు. జైట్లీని రంగంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమంటే, ప్రధాన మంత్రికి ఎంత జనాదరణ ఉన్నప్పటికీ ఆయన మీదే ఆధారపడకుండా ఒక స్థానిక నాయకుడిని కూడా ప్రముఖంగా ఓటర్ల ముందుకు తీసుకురావాలని బీజేపీ తాజాగా తన వ్యూహాన్ని సవరించుకుంది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అవలంబించి విజయం సాధించింది. ఇలా ఉండగా, బీజేపీ శిబిరంలో భయాందోళనలు వ్యాపించాయన్న వార్తలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. జైట్లీని ఫోకస్‌ చేయడం అనేది పార్టీ రాజకీయ వ్యూహంలో భాగం అని, పార్టీ కార్యకర్తల్లో సహజంగానే ఉద్వేగాలు ఆవేశాలు ఉంటాయని ఇవన్నీ సహజమేనని ఆమె తాజా పరిణామాలను ఆమె సమర్థించుకొచ్చారు.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: