పోరాడితే పోయేదేం లేదు... బానిస సంకెళ్లు తప్ప.. అని ఆంధ్రులు విజృంభిస్తారా? ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉదృతం చేస్తారా? రాష్ట్ర విభజనతో అన్యాయం అయి పోయిన తమకు ప్రత్యేక హోదా దక్కకపోతే మరింత అన్యాయం జరుగుతుందని వారు దూసుకొస్తారా? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తారా? ఇప్పటికే విశాఖలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒక ధర్నా జరిగింది.

ఏపీని రెండు గా విభజించి తమకు రాజధానిని లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి జరిగిన అన్యాయాన్ని ఎంతో కొంత పూడ్చాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారితే మారి ఉండవచ్చు.. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ వాళ్లు తప్పించుకోలేరని.. తమకు అన్యాయం చేయకూడదని నిరసన కారులు అభిప్రాయపడ్డారు.

మరి విశాఖలో మొదలైన ఈ ఉద్యమం ఏపీ వ్యాప్తంగా అల్లుకొంటే బాగానే ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు చొరవ చూపితే.. ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమం పెద్దదే అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలదు కూడా. ప్రత్యేక రాష్ట్రల కోసం.. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగడంలో తప్పు లేదు కదా!

అయితే ఆంధ్రులది ఆరంభ శూరత్వమే.. అనే అనుమానాలూ లేకపోలేదు. వెనుకటికి సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో ఉద్యమం జరిగినా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం జనాలు మిన్నకుండిపోయారు. మరి ఈ ప్రత్యేక హోదా వ్యవహారంలో ఆంధ్రుల పోరు ఏ మేరకు జరగుతుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: