మరో పదిరోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ తుది కసరత్తుకు రూపం ఇస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకుంటూ.. ప్రజలను ఆకట్టుకోవడంలో కుస్తీపడుతున్నాయి. కిరణ్బేడీ, కేజ్రీవాల్, అజయ్ మేకెన్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో.. హస్తిన రాజకీయాలు.. కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్నాయి. ప్రధాని మోడీతోపాటు..11మంది కేంద్రమంత్రులు విస్తృతంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. మొత్తానికి వ్యవహారమంతా.. కేంద్ర క్యాబినెట్ వర్సెస్ కేజ్రీవాల్గా మారింది.

ఢిల్లీ మురికివాడల్లోని ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తామంటూ.. వజ్రాయుధాన్ని బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ.. హస్తినలో తమ పార్టీకి పట్టం కడితే.. ఏడాదిలోగా.. జుగ్గీ జోప్డీల్లోనివారికంతా నివాస హక్కు కల్పిస్తామని.. కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇస్తోంది. ఢిల్లీలో జుగ్గీ జోప్డీలో నివసిస్తున్న ఓటుబ్యాంకే టార్గెట్గా కాంగ్రెస్ వేసిన పాచిక చాలా ఖరీదైంది కావడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి. మరోవైపు.. తమపై బీజేపీ సీనియర్ నేతఒకరు పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని.. ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త పల్లవి అందుకుంది. ఇందుకు బీజేపీ భారీ ఎత్తున స్టింగ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పేరు వెల్లడించకుండా..బీజేపీ సీనియర్ నేత ఒకరు ఈమేరకు.. తమపై నిఘాపెట్టారని.. కేజ్రీవాల్ మండిపడ్డారు.

కిరణ్బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని జీర్ణంచేసుకోలేని.. పలువురు పార్టీ సీనియర్లు తమకు కమలనాథుల అంతర్గత వ్యవహారాలపై ఉప్పందిస్తున్నారని.. కేజ్రీవాల్ మీడియాతో పేర్కొనడం విశేషం. అంతేకాదు..ఆ బీజేపీ సీనియర్ ఎవరో అందరికీ తెలుసని.. సంచలనం సృష్టించారు. జగదీష్ ముఖీ, డాక్టర్ హర్షవర్ధన్ బీజేపీ అంతర్గత విషయాలను కేజ్రీవాల్కు అందిస్తున్నారనే ప్రచారం రాజధానిలో జోరుగా సాగుతోంది. ఇక.. తాను అవకాశవాదినైతే.. అసలు..కేజ్రీవాల్ ఎందుకు తనను ఆప్లో చేరమని గతంలో కోరారని కిరణ్బేడీ ఎదురుదాడికి దిగారు. తన వ్యక్తిత్వంపై గతంలో విశ్వాసం ప్రదర్శించిన కేజ్రీవాల్ .. బీజేపీలో చేరగానే తనపై బురదజల్లడాన్ని కిరణ్ బేడీ తప్పుబట్టారు.

ఢిల్లీని తమ ఖాతాలో వేసుకునేందుకు..సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ.. 11మంది కేంద్రమంత్రులను.. 17మంది ఎంపీలను రంగంలోకి దించి.. విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కిరణ్బేడీ ప్రచారం పార్టీ ఆశించన స్థాయిలో లేకపోవడంతో.. పార్టీ పెద్ద టీంనే ప్రచారంలోకి దింపాల్సివచ్చింది. అంతేకాదు.. ఈ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా అరుణ్జైట్లీకి బాధ్యతలప్పగించారు. కిరణ్బేడీతో విభేదిస్తున్న సీనియర్లను జైట్లీ ఇప్పుడు బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ సీనియర్లందిరినీ ఒకేతాటిపైకి తేవడం ఇక జైట్లీ మొదటి టార్గెట్గా మారింది. మరోవైపు.. శతృఘన్ సిన్హా, హేమమాలిని స్టార్ క్యాంపెయినర్లుగా హస్తిన ఓటర్లను ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే నటుడు-గాయకుడు, బీజేపీ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ విస్తృతంగా ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. మోడీ, రామ్దేవ్ను పోలిన వారు.. ప్రచారంలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: