ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఓట్ల పొందడం కోసం రాజధాని నగరం లోని మురికి కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకుముందే బీజేపీ ప్రకటించింది. ఒబామా భారత పర్యటనను బీజేపీ ముఖ్యమంత్రి కిరణ్‌బేడీ తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నించారు. అటు కాలనీల క్రమబద్ధీకరణ హామీ, ఇటు ఒబామా భారత పర్యటనను ఉపయో గించుకోవడం వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఒనగూరే పరిస్థితులు కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఎంతోకాలం కాలేదు. వీటి తర్వాత వరుసగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నింటిలో దాదాపు కాషాయపార్టీ అద్భుత విజయాలు నమోదు చేసుకున్నది. దీనికి నరేంద్రమోడీ గాలి అంటూ బీజేపీ పెద్దలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ వెన్నులో వణకు పుట్టిస్తున్నాయి. అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా జిమ్మిక్కు లేమీ ఇక్కడ పారబోవని కాషాయపార్టీ పెద్దలు అర్థం చేసుకున్నారు. అందుకే రాత్రికి రాత్రి 'అరువు' నేతను పార్టీలోకి తెచ్చుకున్నారు. మాజీ ఐపీఎస్‌, అవినీతి వ్యతిరేక ఉద్యమసారథి అన్నాహజారే బృందం సభ్యరాలు కిరణ్‌బేడీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని కష్టపడిపనిచేసిన నాయకులను ప్రక్కన పెట్టి కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ కాషాయపార్టీ తిరుగులేని విజయాలు నమోదు చేసుకున్నది. రాజకీయ పండితులు, విశ్లేషకులు సైతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం అనే ఏకాభిప్రాయానికి వచ్చారు. కేవలం రెండు వారాల నుండి ఢిల్లీలో బలమైన పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అని అటు ప్రజలు, ఇటు విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఇక బీజేపీ కేవలం కాంగ్రెస్‌తో పోటీ పడటమేనని వ్యాఖ్యానిస్తున్నారు. అతి కొద్దికాలంలోనే ఇంత మార్పు ఎలా సంభవించింది? బీజేపీ అంచనాల్లో ఎక్కడ తప్పిడం జరిగింది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించలేకపోవడానికి ఐదు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సీఎం అభ్యర్థిగా కిరణ్‌బేడీని ప్రకటించడం ఢిల్లీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌బేడీని బీజేపీ అధినేత అమిత్‌షా ప్రకటించిన నాటి నుంచి పార్టీ రాష్ట్రశాఖలో అసమ్మతి చెలరేగింది. అమిత్‌షా నిర్ణయం పట్ల పలువురు సీనియర్‌ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యతిరేకించారు. బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించవద్దని స్పష్టం చేశారు. అయినా పార్టీ అధిష్టానం వినలేదు. దీంతో పార్టీ నాయకుల్లో సమన్వయం కొరవడినట్లు స్పష్టమవుతోంది. కార్యకర్తల భాగస్వామ్యం పూర్తిగా తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే జనవరి 20న బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా నిర్ణయించడాన్ని వారు ఘాటుగా ప్రశ్నించారు. అమిత్‌షా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాత్రికి రాత్రే వచ్చి పడిన కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెను పారాచూట్‌ సీఎంగా అభివర్ణించారు. దీనికితోడు నగరంలో విస్తృత ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆమె ర్యాలీలకు ప్రజల సహకారం ఏమాత్రం కనిపించడం లేదు. బీజేపీ ఊహించినట్లుగా జనం గుట్టలు గుట్టలుగా బేడీ ర్యాలీకి రావడం లేదు. ఢిల్లీ ప్రజల నుండి కిరణ్‌బేడీకి మద్దతు రాకపోవడం పట్ల అమిత్‌షా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆయన అత్యంత సన్నిహితుడు చెప్పారు. సీఎం అభ్యర్థిగా బేడీ పేరు ప్రకటించడం బీజేపీకి పెద్దఎదురుదెబ్బ, ఇది కాషాయపార్టీ చేసిన అతిపెద్ద తప్పిదమని రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు విశ్లేషిస్తున్నారు. బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ దీనికన్నా ప్రమాదకరంగా టిక్కెట్లు కేటాయించడాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ తనకుతాను సెల్ఫ్‌గోల్‌ కొట్టుకునేలా అటు కాంగ్రెస్‌, ఇటు ఆప్‌ నాయకులను పిలిచి మరీ టిక్కెట్లు కట్టబెట్టడుతోంది. సొంత పార్టీ నాయకులను విస్మరించి బయటి నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కృష్ణ తీరథ్‌, ఆప్‌ మాజీ శాసనసభ్యులు వినోద్‌ కుమార్‌ బిన్నీ, ధీర్‌, బీఎస్‌పీ నుండి వచ్చిన బ్రహ్మ సింగ్‌ బిధురిలకు టిక్కెట్లు కేటాయించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు ఢిల్లీలో బీజేపీపై సొంతపార్టీ కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. 'దశాబ్ధాలుగా తాము పార్టీ కోసం నిరంతరం శ్రమించాం. స్థానికులు మమ్ములను అమితంగా ప్రేమిస్తున్నారు. మాకు కచ్చితంగా మద్దతిచ్చేవారు. ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి టిక్కెట్లు ఇవ్వడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది' అని బీజేపీ తూర్పు ఢిల్లీ జిల్లా అధ్యక్షుడు వాపోయారు.

కాషాయపార్టీ సెల్ఫ్‌గోల్‌ : బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాషాయ పార్టీలు, సంఫ్‌ుపరివార్‌ శక్తుల ఆగడాలు, వాటి కార్యకలాపాలు పెరిగిపోయాయి. హిందూత్వశక్తులు తమ వాస్తవ ముఖాలను వెల్లడిస్తున్నాయి. 'రంజాదా లేదా హరంజాదా' అనన బీజేపీ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు, మదరసాలలో ఉగ్రవాదాన్ని బోధిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ చేసిన వ్యాఖ్యలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ప్రతిరోజూ చేస్తున్న వివాదాస్పద ప్రకటనలన్నీ బీజేపీకి నష్టం కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ మహానగరంలో మైనారిటీలను దూరం చేసుకోవడమే. దాదాపు 12శాతం మంది ముస్లిం ఓట్లు, రెండుశాతం క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. ఇక బీజేపీ కన్నా రెండు మాసాల ముందే ఆప్‌ తన ప్రచారం ప్రారంభించింది. ఆప్‌ కార్యకర్తలు నగరంలో శక్తిమంతంగా తయారయ్యారు. పార్టీ, దాని నాయకుని పట్ల ఇంకా వ్యతిరేకత రాలేదు. క్షేత్రస్థాయి నుండి ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే ఆప్‌ ఇప్పుడు కూడా రంగంలో దించింది. బీజేపీ కేవలం వారం రోజుల క్రిత తన అభ్యర్ధులను ప్రకటిస్తే ఆప్‌ రెండు మాసాల క్రితమే ప్రకటించి ఎన్నికల రణంలో దిగింది. ఆప్‌ ఇతర రాష్ట్రాల నుండి తమ కార్యకర్తలను పిలిపించుకొని విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నది. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, పంజాబ్‌, హర్యానా నుండి వేలాదిమంది ఆప్‌ కార్యకర్తలు ఢిల్లీ ఎన్నికల్లో భాగస్వాములయ్యారు. వారి ప్రచార సరళి అటు ఓటర్లను చైతన్యవంతం చేయడమే కాకుండా మోడీ ప్రభను తగ్గిస్తున్నది.

ఆప్‌కు అనుకూలగా ఒపీనియన్‌ పోల్స్‌ : గత ఏడాది నవంబరులో ఏబీపీ-నీల్సన్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 46 సీట్లతో అధికారం చేజిక్కించుకుంటుందని అంచనా. అయితే, అప్పటికీ...ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. హిందూస్థాన్‌ టైమ్స్‌, సీ ఫర్‌ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఆప్‌ ముందుకు దూసుకుపోతోంది. గత ఎన్నికల్ల కన్నా 9శాతం అదనంగా ఆప్‌ సాధిస్తుంది. దాదాపు 40శాతం ఓట్లు ఆప్‌ కైవసం చేసుకుంటుంది. బీజేపీ కేవలం 5శాతం వాటా మాత్రమే పెంచుకోగలుగుతుంది. వచ్చేవారానికి ఇందులో చాలా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో ఆప్‌ ముందుకు దూసుకుపోవడం, కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, బీజేపీలో కుమ్ములాటలు, కిరణ్‌ బేడీ పట్ల ప్రజల్లో స్పందన కొరవడటం, సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను స్వాగతించడం వంటి కారణాలతో బీజేపీకి ఓటమి ఖాయంగా కనిపిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: