తెలుగుదేశం అధికారంలోకి రాగానే నెల్లూరు జిల్లాలో వైకాపా, కాంగ్రెస్ ఖాళీ అవుతాయనుకున్నారు. ముఖ్యంగా వైకాపా నుండి గెలిచిన ఏడుమంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి పోతారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఆ ఊపు అలాగే వుండింది. అట్లాగే ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తనయుడు గౌతమ్ రెడ్డి బీజేపీలో చేరుతారనే వూహాగానాలు వెలువడ్డాయి. ఇక కాంగ్రెస్ లో నుండైతే ఆనం సోదరులు, పనబాక కృష్ణయ్యలు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం వచ్చింది.

ఇప్పుడు రాజకీయ నాయకులకు అధికారమే పరమావధిగా మారింది. పార్టీ సిద్ధాంతం, జెండా, అజెండా, అభిమానం వంటివి ఎప్పుడోపోయాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది అలా వలసవెళ్లారు కూడా.

కాని రానురాను పరిస్థితులు మారుతున్నాయి. అధికారంలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప తెలుగుదేశం నాయకులు విరగబొడుస్తున్నదేమీ లేదు. గట్టిగా రెండు లక్షల రూపాయల పనిని కూడా మంజూరు చేయించుకోలేకపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకునే మార్గాలు మూసుకుపోయాయి. ఎర్రచందనం అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపారు. ఇసుక రీచ్ లు మహిళా సంఘాలకు అప్పగి తెలుగుదేశం నేతల నోట్లో మట్టికొట్టారు. అధికారుల ట్రాన్స్ ఫర్ ల ద్వారా కొంతమంది నాయకులు నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు.

అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకుల దరిద్రాన్ని మిగతా పార్టీల నేతలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీలో చేరి బావుకునేదేమీలేదనే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ర్టంలో రాజకీయ వాతావరణం ఎలా మారుతుందో తెలియదు. ఆరోజు పరిస్థితిని బట్టి భవిష్యత్ ను నిర్ణయించుకోవచ్చనే ఆలోచనలో ఇతర పార్టీల నేతలున్నారు. వచ్చే ఎన్నికల దాకా వెయిట్ అండ్ సి అనే ధోరణిలో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: