అందుబాటులో ఉన్న నివాసాలను విడిచిపెట్టి కొత్త ఆవాసాలను వెదుక్కునే సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. గత ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు దిగినా అంతగా సమస్యలేదు. అయితే ఆర్థికభారంతో అతలాకుతలమవుతున్న నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంకా కోట్లాది రూపాయలను వృధాగా ఖర్చు చేయడంపై అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మానసిక ఉల్లాసానికి మూడు రోజులపాటు చేస్తున్న ఖర్చుపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మర్రి చెట్టు నీడను విడిచిపెట్టినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా హక్కు ఉంది. దీనికయ్యే మొత్తం ఖర్చును జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం 42 శాతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 58 శాతాన్ని భరించాల్సి ఉంటుంది.

ఈ ఒప్పందం మేరకు ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ తన వాటా 58శాతం నిధులను చెల్లిస్తూనే ఉంది. ఈ సంస్థ ప్రాంగణంలో సమావేశాలు, సదస్సులు పెట్టుకునేందుకు సౌకర్యాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏటా దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు ఎంసిహెచ్‌ఆర్‌డిసి ఖర్చు అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా ఐదు కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నప్పటికీ.. అక్కడి సౌకర్యాలను వినియోగించుకోకపోవడంతో కోట్లాది రూపాయలు వృధాగా పోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఖరీదైన హైటెక్స్, నోవోటెల్ వంటి ప్రయివేటు హోటళ్లవైపే మొగ్గు చూపిస్తోంది.

తాజాగా మానసిక ఆనందాన్ని పెంపొందించేందుకు ఏర్పాటుచేస్తున్న శిక్షణ తరగతులను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తున్నారు. దానికోసం చేస్తున్న ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది. ఒక్క పూట అల్పాహారం కోసం మనిషికి ఆరు వందలు, భోజనానికి 13 వందలు చొప్పున ఖర్చు చేసి మరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఒక రోజు కార్యక్రమం నిర్వహణ కోసం దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. మొత్తం కార్యక్రమానికి 1.50 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని హెచ్‌ఆర్‌డిలో నిర్వహిస్తే పాతిక లక్షలు కూడా ఖర్చు కాదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడపాదడపా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ భవనాలను వినియోగించుకుంటోంది. ఎక్కువగా ప్రయివేటు హోటళ్లవైపు వెళ్లకుండా చూసుకోవడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హెచ్‌ఆర్‌డిని విస్మరిస్తోంది. ఇలా చేసే బదులు పూర్తిగా హెచ్‌ఆర్‌డిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేస్తే ఏటా ఐదు కోట్ల రూపాయలైనా మిగులుతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: