మనది ప్రజాస్వామ్యమే అయినా.. ఈ వ్యవస్థలో పార్టీలు కొంత సానుభూతికి కూడా విలువనిస్తాయి. పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబ సభ్యులెవరైనా తెరపైకి వస్తే.. వారి కోసమని ఎన్నికను ఏకగ్రీవంగా ముగించేయడం కొనసాగుతున్న పద్ధతే. అయితే తెలుగుదేశం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. మొదటగా తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ రాగానే కాంగ్రెస్ పార్టీ పోటీకి సై అంది.

తిరుపతి ఉప ఎన్నికకు చివరాఖరుకు 13 మంది అభ్యర్థులు మిగిలారు! ఏకగ్రీవంగా జరిగిపోవాల్సిన ఎన్నికలో ఏకంగా ఇంతమంది అభ్యర్థులు మిగిలారు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేమరణంతో వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో ఇంతమంది నిలబడటం అంటే అది తెలుగుదేశం పార్టీ మ్యానేజ్ మెంట్ లో ఫెయిలవ్వడం వల్ల జరిగిందేనని చెప్పుకోవాల్సి వస్తోంది.

అదేంటి.. వైకాపా పోటీ చేయడం లేదు కదా, కాంగ్రెస్ ఎలా పోటీ చేస్తుంది? అంటే... తమకు టీడీపీతో పాత లెక్కలున్నాయని... గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోయిన నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించక తెలుగుదేశం అధ్యక్షుడు అభ్యర్థిని పోటీ లో పెట్టాడని.. అందుకే తాము ఇప్పుడు పోటీ పెడుతున్నామని కాంగ్రెస్ నేతలు సమర్థించుకొంటున్నారు. తద్వారా తాము తప్పేం చేయడం లేదని వారు అంటున్నారు.

ఇక లోక్ సత్తా కు ఉన్నట్టుండి వారసత్వ రాజకీయాలపై విరక్తి పుట్టింది. ఆ విరక్తితోనే ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీ ఉంచుతున్నామని ఆ పార్టీ ప్రకటించింది. మరికొందరు స్వతంత్రులు తయారయ్యారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరణించిన వెంకటరమణపై కూడా ధ్వజమెత్తుతున్నారు. ఆయనను అవినీతి పరుడని విమర్శిస్తున్నారు. మరి ఇది తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసే అంశమే. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఏవో సంచన ఫలితాలు వస్తాయని మాత్రం అనుకోలేం. పోటీ అయితే ఆసక్తికరంగా మారిందిప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: