మాన్‌ష్టర్‌ ఇండియా సంస్థ చేపట్టిన సర్వేలో అన్ని రంగాలకన్నా ఐటి రంగంలోని ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది (ప్రజాశక్తి 22 జనవరి 2015). ఈ సంస్థ పొందుపరచిన గణాంకాలు బహుళజాతి అగ్రశ్రేణి కంపెనీల విషయంలో కొంతమేర వాస్తవం అయి ఉండవచ్చు గానీ చిన్న సంస్థలలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల వేతనాల విషయంలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఒక గణాంక పరిశీలనలా కాకుండా సామాజిక దృక్కోణంలో పరిశీలిస్తే మరిన్ని విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

కిందిస్థాయి సంస్థలలో కేవలం అనుభవం సంపాదించడం కోసం నామ మాత్రపు వేతనంతో పనిజేసే ఉద్యోగులు చాలామంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నగరాలలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ ఎప్పటికైనా మంచి వేతనంతో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న చిరుద్యోగులు కోకొల్లలు. వీరిలో ఎక్కువమంది దిగువ మధ్యతరగతి, సన్నకారు రైతు కుటుంబాల నుంచి వచ్చినవారే! నగర జీవితానికి, ఐటి ఉద్యోగపు జీవన సరళికి వీరి జీతం సరిపోని పరిస్థితిలో తల్లిదండ్రులు డబ్బులు పంపుతున్న సందర్భాలు వీరి సామాజిక స్థితికి నిదర్శనం. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన వృత్తి విద్యా కళాశాలల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న విద్యార్థులను ఐటి రంగం ఊరించినా, వాస్తవంగా అసలైన ఐటి నిపుణులుగా మంచి జీతాలతో స్థిరపడుతున్నది కొద్దిమంది మాత్రమే! మిగిలినవారు అరకొర నైపుణ్యంతో, అత్తెసరు జీతాలతో ఒక ''అసంఘటిత మేధో కార్మిక వర్గం''గా రూపొందారు.

అసంఘటిత రంగంలోని ఇతర కార్మికులకు ప్రస్తుతం అమలులో ఉన్న కనీస వేతన చట్టం ద్వారా కొంత భద్రత ఉన్నది కానీ ఐటి రంగంలోని అసంఘటిత మేధో కార్మికులకు సమగ్రమైన కనీస వేతన చట్టం మన రాష్ట్రంలో లేదు. ఈ దిశలో కేరళ రాష్ట్రం 1948 నాటి కనీస వేతనాల చట్టాన్ని అనుసరించి ఐటి ఉద్యోగులకు కనీస వేతనాలను నిర్దేశిస్తూ 2011లో గజెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వేతనం ప్రముఖ సంస్థలలో చెల్లిస్తున్న వేతనాల కంటే తక్కువైనప్పటికీ ప్రభుత్వ నోటిఫికేషన్‌ వల్ల చిన్న సంస్థలలో తక్కువ వేతనంతో పనిచేసే ఐటి ఉద్యోగులకు కొంత వేతనపరమైన భరోసా చేకూరింది.

పారిశ్రామిక విప్లవం పర్యవసానంగా ఫ్యాక్టరీ చట్టం, కనీస వేతనాల చట్టం రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచగమనాన్ని అత్యంత ప్రభావితం చేసి ఎక్కువ ఉద్యోగులను కల్పిస్తున్న సమాచార సాంకేతిక విప్లవం దృష్ట్యా ఐటి రంగంలో వేతనాలను, పని పరిస్థితులను, మహిళా ఉద్యోగుల సదుపాయాలను నిర్దేశిస్తూ సమగ్రమైన చట్టాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: