ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే కృతనిశ్చయంతో ప్రాణాలను పణంగా పెట్టి.. కేంద్రం కొమ్ములు వంచి అయినా సాధించాలని నిరవధిక నిరాహార దీక్షను ఆరురోజుల పాటూ పూర్తిగా కొనసాగించిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. దీక్ష విరమించడానికి ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్న జగన్‌ను మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


ఆస్పత్రి వైద్యులు అక్కడ ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. ఆయన కుటుంబసభ్యులందరూ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. గుంటూరు జనరల్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో జగన్‌కు చికిత్సలు అందిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని గుంటూరు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. 


జగన్‌ ఆరురోజులుగా ప్రత్యేకహోదా కోసం దీక్ష చేస్తూ ఉండగా.. సోమవారం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరీ విషమించింది. మరికొంత సమయం గడిస్తే.. ఆరోగ్యం ప్రమాదకరంగా తయారవుతుందని కూడా డాక్టర్లు ఆందోళన చెందారు. అయితే జగన్‌ మాత్రం.. తాను దీక్ష విరమించడానికి ససేమిరా అన్నారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నించవచ్చునని సోమవారం నాడు పూర్తిగా అనుమానాలు ఉండడంతో ఆ రోజంతా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రానికి వైకాపా నాయకులు అందరూ కూడా అక్కడ మోహరించారు. సుదీర్ఘమైన హైడ్రామాతరువాత.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జగన్‌ను పోలీసులు అరెస్టు చేసి దీక్ష భగ్నం చేశారు. ఆయననుదీక్షాస్థలంనుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారు. తాను శాంతియుతంగానే దీక్ష చేస్తున్నానని హోదా వచ్చేవరకు విరమించబోనని జగన్‌మోహన రెడ్డి.. ఎంత చెప్పినా వినకుండా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. 


పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మీద లాఠీచార్జి చేసిమరీ పోలీసులు జగన్‌ను అరెస్టు చేయడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: