చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వేలాది మదుపుదారులకు శఠగోపం పెట్టి వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన కుంభకోణంలో చిక్కుకున్న అగ్రిగోల్డ్ సంస్థ భూములు, ఇతర ఆస్తులను అత్యంత చౌక ధరలకు మంత్రి ప్రత్తిపాటి కొనేశాడని వైకాపా నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ ఆరోపంచడంతో సంచలనం చెలరేగింది. మంత్రి నేరుగా తన పేరుతో కాకుండా తన భార్య పేరిట అగ్రిగోల్డ్ ఆస్తులను రిజిస్టర్ చేయించారని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకువస్తామని వారు తెలిపారు.


నిప్పులాంటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశాడని నిరూపించేందుకు తమ వద్ద డాక్యుమెంట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వైకాపా నేతలు సవాలు చేశారు. మదుపుదారుల పొట్టగొట్టి అగ్రిగోల్డ్ కంపెనీ పోగుచేసిన భూముల్ని, ఆస్తుల్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని స్వాధీనం చేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే చంద్రబాబే ప్రత్తిపాటిని సాగనంపాలని వారు డిమాండ్ చేశారు.


కాగా తనపై వైకాపా నేతలు చేసిన ఆరోపణలను నిరూపించవలసిందిగా ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి సవాల్ చేశారు. తన భార్య పేరుతో కనీసం ఒక ఎకరా భూమిని కూడా రిజిస్ట్రర్ చేయలేదని మంత్రి ప్రకటించారు. తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసిన వైకాపా నేతలపై మంత్రి మండిపడ్డారు. తనపై బురద జల్లడానికే ఈ తరహా ఆరోపణలకు దిగుతున్నారని, అవినీతిలో గొంతు వరకు కూరుకుపోయిన, భారీ మొత్తంలో డబ్బులు కొల్లగొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తనపై ఆరోపణలు గుప్పించే అర్హత లేదని మంత్రి తిప్పికొట్టారు. 
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అలా పక్కన ఉంచితే మంత్రి అవినీతిలో నిజానిజాలను వైకాపా నేతలు నేరుగా సాక్ష్యాధారాలతో వెల్లడించవచ్చు గదా..  అంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్నప్పుడు వాటిని బయట పెట్టడంలో వారికున్న సమస్యలేమిటో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: