రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని జాతీయ హరిత ట్రిబ్యునల్ మద్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణపనులను, శంకుస్తాపన పనులను నిర్వహించుకుంటూ పోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులూ తీసుకోనందునే రాజధాని ప్రాంతంలో భూమి చదును కార్యక్రమాన్ని నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశమిచ్చింది. కాగితంపులి గర్జిస్తే ఎంత? మూలిగితే ఎంత? అన్నట్లుగా ట్రిబ్యునల్ వారు ఇచ్చిన ఆదేశాలను నామమాత్రంగా కూడా ఖాతరు చేయకుండా ఏపీ సర్కారు తాను చేయదలచుకున్న పనిని చేసుకుంటూనే వెళ్తోంది.


చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఎంత అహంకార పూరితంగా ఉందో ఆ ట్రిబ్యునల్ తీర్పు పట్ల దాని స్పందన బట్టే అర్థమవుతుంది. అక్టోబర్ 22న సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీయే రాజధాని శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా భూమి చదును కార్యక్రమాలను ట్రిబ్యునల్ ఎలా అడ్డుకోగలదు అంటూ బరితెగించి ప్రశ్నిస్తున్నారు. టీడీపీ చేస్తున్న ఈ వాదన అర్థరహితం.  ఎందుకంటే నూతన రాజధానిని నిర్మించిపెట్టే విషయంలో అయినా సరే అవసరమైన అనుమతులూ, నిబంధనలను పాటించడం నుంచి ప్రధానికి కూడా మినహాయింపు ఉండదనేది మర్చిపోకూడదు. మరో మాటలో చెప్పాలంటే ట్రిబ్యునల్ అనుమతి మంజూరు చేస్తే తప్ప ప్రధాని కూడా రాజధాని శంకుస్తాపనకు హాజరవడానికి పూనుకోకుడదు. అలా చేయడం ప్రధాని స్థాయికి తగినది కాదు. 


రాజధాని పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి బరితెగింపు కార్యక్రమాలను ట్రిబ్యునల్ వెంటనే నిలిపివేయవలసిన అవసరం ఉంది. లేకుంటే కోరలు లేని ఇలాంటి సంస్థల ఉనికి దేనికి? ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నాడు.. కేంద్రంలో పర్యావరణ అనుమతులు మొత్తం రెడీ అయిపోయాయి.. ఇదిగో వచ్చేస్తున్నాయి.. అదిగో వచ్చేస్తున్నాయి.. అంటూ ఊదరగొట్టారు. ఇప్పటిదాకా అతీగతీ లేదు. పనులు మాత్రం ఆగలేదు. మరి రేపు ఏంటో తెలియడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: