రైతుల ఆత్మహత్య కేసులో తననూ ఒక కక్షిదారుగా చేర్చవలసిందిగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం టిడీపీ నేతలు తనను కలిసిన తర్వాతే కోదండరామ్ కోర్టు తలుపులు తట్టడం తీవ్ర సంచలనానికి దారితీసింది. రైతు ఆత్మహత్యలపై జన చైతన్య సమితి ఒక పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ విద్యావంతులు వేదిక తరపున కోదండరామ్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానుంది. రైతు అంశాల విషయానికి వస్తే తొలినుంచి సర్కారు వైఖరిని ఈసడిస్తూనే ఉన్న కోదండరాం ఉద్యోగం నుంచి రిటైరైన తరువాత.. ఇక పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ చేస్తున్నారు. తెదేపా నేతలతో భేటీ తర్వాత.. ఆయన నిర్ణయాలు రాజకీయ పరంగా ఏమీ వెల్లడి కాలేదు గానీ.. ప్రజల్లో మాత్రం అనుమానాలున్నాయి. 


అంతకుముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కోదండరామ్‌ని మంగళవారం ఉదయం కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ సంక్షోభంపై తాము చేస్తున్న ఆందోళనకు మద్దతివ్వవలసిందిగా కోరారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పిటిషన్ దాఖలు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. లోపభూయిష్టంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విధానాలే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని కోదండరామ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని కోదండరామ్ తన పిటిషన్లో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా కోదండరామ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ మధ్య మంగళవారం జరిగిన సమావేశం రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది. ప్రభుత్వ  నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రైతుల ఆత్మహత్యలపై కోదండరామ్ పిటిషన్ వేయటంతో భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని రాజకీయ పరిశీలకుల భావన. ఆయన గనుక తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లయితే ఆ పార్టీకి అది చాలా పెద్ద ఎడ్వాంటేజీ అవుతుంది. సామాజిక వర్గ సమీకరణల పరంగా, విశ్వసనీయత పరంగా, ఉద్యమ భావజాలం  పరంగా, తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలగడం పరంగా తెలుగుదేశం ఒక అడుగు  ముందుకేస్తుంది. మరి ఆ పరిణామమే గనుక జరిగితే గులాబీ పార్టీలో ఏమేరకు ఆందోళన ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. 



మరింత సమాచారం తెలుసుకోండి: