తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతల్లో బతుకుమ్మ ఒకటి. దసరా ముందు రోజుల్లో తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ జోరుగా సాగుతుంది. స్కూళ్లకు సెలవలు కూడా తోడవడంతో పిల్లా,పెద్దా అంతా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. తెలంగాణ వచ్చాక ఈ సందడి మరింతగా పెరిగింది. ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహిస్తోంది. 

ఐతే.. ఈ సర్కారీ ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి సంస్థ ఆధర్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె మొదటి నుంటీ ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వీటికో గుర్తింపు తీసుకొచ్చారు. ఐతే..  బతుకమ్మ సంబరమంతా కవితదేనా అని అనుకున్నారో ఏమో కానీ తెలంగాణ టీడీపీ నేతలు కూడా బతుకమ్మ సంబరాలపై దృష్టి సారించారు.  

తమ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రాలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఆంధ్రా రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టీడీపీ నేతలు బతకమ్మ ఉత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహిస్తారట. ఈ సందర్భంగా ఒక పెద్ద బతకమ్మను చంద్రబాబు నాయుడుకు సమర్పించాలని కూడా వీరు నిర్ణయించారని తెలిసింది. 

తెలంగాణ సంబురాలను తెలంగాణలో నిర్వహించకుండా ఆంధ్రాలో నిర్వహిస్తే ఉపయోగమేంటన్నది అంతుబట్టని విషయంగా ఉంది. అమరావతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ద్వారా టీడీపీ రెండు ప్రాంతాల సంస్కృతులకు  అనుసంధానంగా ఉంటుందనే సందేశం ఇస్తారట. మరి ఆంధ్రాలో బతుకుమ్మ ఎలా ఆడతారో.. అక్కడి జనం ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: