వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై పట్టు సడలించే సూచనలు కనిపించడం లేదు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వినా మరొక ప్రత్యామ్నాయం వద్దంటూ ఆరురోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జగన్, ఏపీ ప్రభుత్వం తన దీక్షను భగ్నం చేసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే కలిసి ప్రత్యేక హోదా సమస్యపై చర్చించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అప్పాయింట్‍‌మెంట్‌ను కోరినట్లు తెలిస్తోంది.


పార్టీ వర్గాల ప్రకారం వైకాపా అధినేత మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపున ప్రత్యేక హోదా డిమాండుతో అక్టోబర్ 17నుంచి 21 వరకు నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. బుధవారం విజయవాడలోని సీడబ్ల్యూడీ మైదానం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ ఆఫీసుకు వైకాపా కార్యకర్తలు ర్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. 


అక్టోబర్ 17న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరాహార దీక్షలు చేస్తామని, 18న ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని, 19న కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామని, 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ డిపోల వద్ద పికెటింగ్ నిర్వహిస్తామని వైకాపా ప్రకటన విడుదల చేసింది. ఆరురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కిమ్మనకుండా ఊరకుండినప్పటికీ, వైకాపా అధినేత జగన్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రత్యేక హోదాపైనే దృష్టి పెట్టడానికి కారణం ఉంది. రాజధాని నిర్మాణంతో సహా ఏపీకి తాను చేసే సహాయం గురించి పెదవి విప్పని కేంద్రం వైఖరి పట్ల ఆంద్ర ప్రజలు తీవ్ర అసమ్మతితో ఉన్నారు. దీనికి తోడుగా అగ్నికి ఆజ్యం పోసేలా చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు జగన్‌పై వ్యతిరేకత ముసుగులో ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రతికూల వ్యాఖ్యలు ప్రజలను దహించివేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది తెలుగుదేశం పాలిట, కేంద్రం పాలిట నిరంతరం మండే రావణకాష్టంలా తయారయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ వీలైనంత దీర్ఘకాలం ఈ సమస్యను రగిలించి ప్రజలను సమీకరించడానికే సిద్ధమవుతున్నారు. ఎలాగూ కేంద్రం అక్టోబర్ 21 తర్వాత కూడా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశాలు ఏ కోశానా లేవు కాబట్టి జగన్ జన సమీకరణకు ఇంతకంటే మంచి అంశం లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన హీరోగా ఇప్పటికే క్రేజ్ సాధించిన జగన్ చివరివరకు ఇదే బాటలో కొనసాగినా ఆశ్చర్యం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: