నరేంద్ర మోదీ ప్రభంజనం, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్ధానం కారణంగా ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు జోడీ ఏపీని శరవేగంగా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారని జనం తెగ నమ్మేశారు. అలా నమ్మి నమ్మి ఇప్పటికి 16 నెలలు పూర్తయింది. ఈ ఇద్దరు నాయుళ్లమీద ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పుడు పూర్తిగా ఆవిరైపోయాయి. 


దక్షిణాదిలో ఓటర్లు తమపట్ల చూపుతున్న ఆదరణకు పొంగిపోతున్న బీజేపీ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీగా మరింతగా బలోపేతం కావాలని ఆశిస్తోంది. ఈ అంశంలో తనకు అడ్డు వచ్చే దేన్నీ, ఎవరినీ సహించేది లేదన్న ధోరణిలో బీజేపీ వైఖరి ఉంది. మరోవైపు అమరావతిపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏవిధంగానూ కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేసే స్థితిలో లేరు. అమరావతిపై తనను ఎవరూ ప్రశ్నించకూడదని, బిలియన్ డాలర్ల పెట్టుబడులతో తాను చేసుకుంటున్న ఒప్పందాల జోలికి ఎవరూ రాకూడదని చంద్రబాబు భావిస్తున్నారు


ఈ ఇరు పార్టీల కుమ్ములాటల మధ్య సర్వనాశనమవుతున్నది ప్రజలే. అయితే బీజేపీకి ప్రత్యేక హోదాపై ఏమంత వ్యతిరేకత లేదు కానీ ప్రత్యేక హోదాను ప్రకటిస్తే ఆ క్రెడిట్ మొత్తంగా తెలుగుదేశానికే వెళుతుందని భయపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలో ఇటీవల పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన బీజేపీ పట్ల ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.


పైగా ఏపీ ప్రయోజనాలకు వెన్నుపోటు పొడిచిన కావూరి సాంబశివరావు, పురందేశ్వరి వంటి నేతలను ద్రోహులుగా ఏపీ ప్రజలు చూస్తుంటే వారిని సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న బీజేపీ పెద్ద తప్పటడుగు వేసిందనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ గురించి మనసులో బీజేపీకి మంచి ఉద్దేశాలు ఉంటున్నప్పటికీ అది వ్యవహరిస్తున్న తీరును చూసినట్లయితే ఆంద్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: