హిజ్రాలు.. వీరిని చూస్తేనే సాధారణ జనం హడలి పోతుంటారు. విచిత్రంగా చూస్తారు.. హేళన చేస్తారు. సినిమాల్లో కామెడీకీ, వెకిలి సంభాషణలకూ వీరే పెట్టుబడి. అవమానాలు, అవహేళనలే వీరి జీవితం.. జీవితం అందించిన అనుభవాలతో వీరు కూడా రాటు దేలతారు. గౌరవంగా బతుకుదామన్నా ఎవరూ అవకాశాలు ఇవ్వరు. అందుకే వీరు దౌర్జన్యం, బెదిరింపులు, భిక్షాటన ద్వారా పొట్టపోసుకుంటుంటారు. 

ఓ హిజ్రా మాత్రం జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చరిత్ర సృష్టించింది. ఆడా మగా కాని వాడంటూ అంతా గేలి చేసినా.. ఆ అవమానాలనే కసిగా మలచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించింది. అయినవాళ్లే అవమానపరిచినా తనకు నచ్చినబాటలోనే అడుగులేసి సమాజంలోనే ఓ బాధ్యతాయుత స్థానంలో నిలబడింది. దేశంలోనే మొట్టమొదటి  హిజ్రా పోలీస్‌ అధికారిగా ఆమె ఇప్పుడు చరిత్ర సృష్టిస్తోంది. ఆమే ప్రీతికా యాషినీ.

ఇప్పుడు ఈమెను చూస్తే ఎవరూ గతంలో ఈమె ఓ యువకుడు అని అనుకోరు. తమిళనాడులోని సేలంలో జన్మించిన ఈ ప్రీతికా పుట్టుక తో ప్రదీప్ కుమార్. ఆరేడు తరగతులకు వచ్చేసరికి తనలో మార్పులు తానో అమ్మాయి అని గుర్తు చేసేవి. అమ్మాయిగానే ఉండాలనిపించేది. తోటి అబ్బాయిల పక్కన కూర్చోలేకపోయేవాడు ప్రదీప్. ఇలాంటి అవమానాలు, ఇబ్బందుల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు.  

ఆ తర్వాత ఇక తనవల్ల కాదని.. అమ్మాయిలా మారతానని ఇంట్లో చెప్పాడు. వాళ్లు చెడామడా తిట్టారు. వేరే మార్గంలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. సేలం నుంచి పారిపోయి చెన్నై చేరుకున్న ప్రదీప్‌ హిజ్రాల పంచన చేరాడు. వారి కోపరేషన్ తోనే సెక్స్ మార్పిడి చేయించుకుని ప్రీతికా యాషినిగా కొత్త జీవితం ప్రారంభించింది. మనసులోని కోరిక తీరింది.. మరి జీవితం ఎలా..?

అప్పుడే తమ మార్గంలోనే నడవమని చాలా మంది హిజ్రాలు చెప్పారు. కానీ ప్రీతికా గౌరవంగా బతకాలనుకుంది. అందుకే డిగ్రీ ఆధారంగా చిన్న ఉద్యోగం చూసుకుని ఎస్సై పరీక్షలకు ప్రిపేరైంది. పట్టుదల, దీక్షతో చదివింది. సాధన చేసింది.  కానీ ఆడా, మగలకే తప్ప అటూ ఇటూకానీ వారికి పోలీస్ ఉద్యోగానికి అనర్హులకు పోలీస్ డిపార్ట్ మెంట్ తేల్చి చెప్పింది. ప్రీతికా వెనక్కు తగ్గలేదు. మద్రాసు కోర్టు మెట్లెక్కింది. తాను చేసిన తప్పేంటని.. తాను ఎందుకు ఉద్యోగానికి అనర్హురాలినని నిలదీసింది. 

కోర్టు ప్రీతికా సమస్యను సానుభూతితో అర్థం చేసుకుంది. ఆమెను పరీక్షకు అనుమతించాలని తీర్పు చెప్పింది. ఆ తర్వాత కూడా ఎన్నో అవరోధాలు. రన్నింగ్ లో ఒక సెకండ్ ఆలస్యమైందన్నారు. సర్టిఫికెట్లలో పేరు తప్పు ఉంది అన్నారు.. అన్ని అవరోధాలనూ సహనంతో ఎదుర్కొంది. కోర్టు మద్దతుతో ప్రీతికా పోరాడి గెలిచింది.

తన సత్తా చాటి చివరకు ఎస్సైగా ఉద్యోగం సాధించింది. దేశంలోనే ఇలాంటి విజయం సాధించిన తొలి హిజ్రాగా చరిత్ర సృష్టించింది. తన విజయగాథ తోటి హిజ్రాల జీవితాల్లో వెలుగులు నింపగలదని ప్రీతికా యాషినీ విశ్వసిస్తోంది. ఎస్సైగా తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చెయ్యగలనన్న విశ్వాసం ఉందంటున్న ప్రీతికా ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన అంతిమ లక్ష్యమంటోంది. తను ఆ లక్ష్యం కూడా అందుకోవాలని మనసారా కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: