దేశ చరిత్రలో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంకుకు చుక్కలు చూపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. మామూలు చుక్కలు కాదు.. గతంలో తనతో ఆడుకున్న పాపానికి ఇప్పుడు దేశ కేంద్ర బ్యాంకునే తెలంగాణ ప్రభుత్వం ఫల్టీ కొట్టించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి పన్ను నోటీసులు అందుకున్న రిజర్వ్ బ్యాంకు అధికారులు ఏం చేయాలో పాలుపోక బిత్తరపోయారంటే కేసీఆర్ ప్రతీకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

విషయంలోకి వస్తే హైదరాబాద్‌లో లకడీకాపూల్, చెంగిచెర్ల రెండు ప్రాంతాల్లో భారతీయ రిజర్వ్ బ్యాంకు రెండు టంకశాలలను నిర్వహిస్తోంది. ఇక్కడ నాణాలను ముద్రిస్తుంటారు. ఇవి రెండూ వ్యాపార సంస్థలు కాబట్టి సంవత్సరానికి వ్యాట్ కింద 25 కోట్ల రూపాయలను ఆర్బీఐ చెల్లించాలని, ఇంతవరకు అది చెల్లించకుండా ఉన్న 200 కోట్ల మొత్తాన్ని కూడా చెల్లించాలని తెలంగాణ ప్రభుథ్వం రిజర్వ్ బ్యాంకుకు పన్ను చెల్లింపు నోటీసులను అందజేసింది.

 

తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి తనకు రావలసిన ఆదాయ పన్ను బకాయిలకు గాను కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి ఆర్బీఐ రూ. 1200 కోట్లను తీసేసుకుంది. ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పడరాని పాట్లు పడింది.

 

ఇక్కడ గమనించవలిసింది ఏమిటంటే హైదరాబాద్ లోని తన నాణేల ముద్రణ శాలలకు వ్యాట్‌ను మినహాయించాలని ఆర్బీఏ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. సమైక్యరాష్ట్లంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్పీఐ ఈ వ్యాట్ మినహాయింపు పత్రాన్ని దాఖలు చేసుకుంది. ఇన్నాళ్లుగా దాని అతీగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తవ్వి తీసి దుమ్ము దులిపి భారతీయ రిజర్వ్ బ్యాకుకు సవాలు విసిరింది. కేసీఆర్ తన ప్రత్యర్థులను అంత తేలికగా వదలరన్నది జగమెరిగిన సత్యం.  రాజకీయ పక్షాలంటే సరేసరి. చివరకు కేంద్ర బ్యాంకును కూడా వదలని కేసీఆర్‌ని చూసి జనం ఔరా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: