గులాబీ అధినేతకు ఆగ్రహం వచ్చింది. నిర్లక్ష్యంతో కూడిన అధికారుల వైఖరి.. తెలంగాణ రాష్ట్రానికి చేసిన నష్టం వలన.. ప్రభుత్వం ప్రజల వద్ద మాట పడాల్సి వస్తున్నదని ఆయన కోపగిస్తున్నారు. ఇదంతా కేంద్రం కేటాయించే పక్కాఇళ్లకు సంబంధించిన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఇళ్లలో తెలంగాణకు కేవలం పది శాతం కూడా దక్కకపోవడం కేంద్రం పక్షపాతం కాదని, తమ సర్కారు వైఫల్యంగా ప్రజలకు తెలిసిపోతున్నదని కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. 


అత్త తిట్టిందని కాదు.. తోటి కోడలు నవ్విందని ఒక కోడలు గంతలో భోరున విలపించిందట. తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఇప్పుడు దాన్నే తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు గాను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన మొత్తం తీవ్ర వివాదానికి దారితీసింది. మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణపథకం కోసం మంజూరుచేసిన మొత్తంలో 75 శాతం పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేజిక్కించుకుంది. కేంద్రం కేటాయించిన రూ. 2,897 కోట్ల నిధులతో ఏపీ దాదాపు 1.93 లక్షల ఇళ్లను నిర్మించబోతోంది. అదే సమయంలో తెలంగాణకు కేవలం 10 వేల ఇళ్ల నిర్మాణాల భాగ్యం దక్కింది. దీంతో కడుపు మండిన తెలంగాణ నేతలు ఇప్పటికే పాత పాట మొదలెట్టేశారు. కేంద్రం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, తెలంగాణను రాచి రంపాన పెడుతోందని తెరాస నేతలు భోరుమంటున్నారు. 


కాని తరచి చూస్తే వాస్తవాలు మరొకలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఖచ్చితమైన హోం వర్క్ ఫలితంగానే ఆ రాష్ట్రానికి అంత భారీ స్థాయిలో కేటాయింపులు జరిగాయని వెల్లడయింది. అందరికీ ఇళ్లు  పథకాన్ని కేంద్రం ప్రకటించినప్పుడు ఏపీ ప్రభుత్వం తక్షణమే రెండు కమిటీలను ఏర్పర్చి లబ్దిదారుల యాజమాన్యంలోని భూమిలో గృహ నిర్మాణాలు చేపట్టడం, ఇంటి నిర్మాణాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం వంటి ప్రతిపాదనలతో కేంద్రానికి నివేదికలు పంపింది. 


పైగా ఏపీ ప్రభుత్వం ఏర్పర్చిన ఈ రెండు కమిటీలు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం టచ్ లో ఉంటూ వారడిగిన అన్ని సందేహాలను నివృత్తి చేశారట. ఇంత కఠిన శ్రమ చేసిన తర్వాతే ఈ కమిటీలు దాదాపు రెండు లక్షల ఇళ్ల కేటాయింపును సాధించాయి. అంతే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడిని ఈ సమస్యపై పదే పదే కదిలించి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకున్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పారదర్శకంగా ఉన్నందున వెంకయ్య నాయుడు కూడా ఏపీకి గరిష్టంగా సహకరించినట్లు తెలిసింది.


అంత పక్కాగా వర్క్ చేయకుండా.. కేంద్రం అడిగింది కదాని.. ఏదో మొక్కుబడిగా ప్రతిపాదనలు పంపి అంతటితో చేతులు విదిల్చుకోవడం మాత్రమే తెలంగాణ సర్కారు పరంగా జరిగిన కసరత్తుగా కనిపిస్తోంది.  కనీసం పొరుగు రాష్ట్రం అధికారులు ఏం చేస్తున్నారో.. చూసి, ఆ రకంగా పనిచేయడం కూడా చేతకాదా.. అంటూ ఇప్పుడు కేసీఆర్ సంబంధిత శాఖాధికారుల మీద కన్నెర్ర చేస్తున్నారట. అధికారులు ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలి గానీ... ప్రభుత్వం పరువు తీసేలా వ్యవహారం తయారైందని గులాబీ బాస్ ఆగ్రహిస్తున్నారట. ఆయన ఆగ్రహంలో కూడా అర్థముంది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను బట్టే తాము కేటాయింపులు చేశాం అంటూ వెంకయ్య కూడా స్వయంగా ప్రకటించిన తర్వాత పాపం మొత్తం తెలంగాణ సర్కారుకే చుట్టుకుంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: