సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. మొదట ఇది కటారి మోహన్ రాజకీయ ప్రత్యర్థి సీకే బాబు పని అయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మోహన్ మేనల్లుడే అన్న విషయం బయటికొచ్చింది. ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు అందుకు తగిన ఆధారాలు లభించడం మొదలుపెట్టాయి. చింటూ పరారీ కూడా దీన్ని ధ్రువీకరించింది. 

చంపింది చింటూయే అయినా.. అతని వెనుక ఎవరున్నారన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. చింటూ ఆచూకీ తెలియడం లేదు. అతన్ని పట్టిస్తే ప్రభుత్వం  లక్ష నజరాన ప్రకటించింది. హత్యకు పాల్పడిన  చింటూ, జయప్రకాష్‌ నివాసాలను, బెంగుళూరులోని మరో నిందితుడు వెంకటాచలపతి ఇంటిని  శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. చిత్తూరు జిల్లా రిజ్రిస్టేషన్‌ కార్యాలయంలో చింటూ ఆస్తుల వివరాలను సేకరించారు.

చింటూ- మోహన్ సంబంధాలను పరిశీలిస్తే.. వీరిద్దరికీ కొంతకాలంగా మాటలు లేవు. గతంలో మోహన్ చింటూకు ఓ గ్రానైట్‌ క్వారీ ఇచ్చారు. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున సాయం చేశారు. చిన్న చిన్న గొడవలు తప్పితే హత్యలు చేసుకొనే స్థాయికి చింటూ తెగించే పరిస్థితి లేదు. ఐతే.. ఈ మధ్య టీడీపీలోనే మోహన్ కు ప్రత్యర్థులు తయారయ్యారు. టీడీపీలోని ఓ వర్గానికి మోహన్ కంటగింపుగా తయారయ్యాడు. 

ఈ నేపథ్యంలో చింటూను కొందరు టీడీపీ నేతలు పావుగా వాడుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. మోహన్ దంపతులు హత్యకు ఓ మాజీ కౌన్సిలర్‌, టౌన్‌ బ్యాంకు సభ్యుడు అన్నివిధాలా సాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తెరవెనుక ఓ మాజీఎ మ్మెల్యే, జిల్లా టీడీపీ ప్రముఖ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే చింటూ అకౌంట్లో 5 లక్షలు జమయ్యాయి. ఆ సొమ్ముకు హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరికొన్ని రోజులైతే కానీ  ఈ కేసు విషయంలో స్పష్టత కనిపించదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: