కేంద్రంతో తెలంగాణ సర్కారు వైఖరి విషయంలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. కేసీఆర్ సీఎం అయిన మొదట్లో మోడీ పట్ల అంటీ ముట్టనట్టుగానే ఉండేవారు. కొన్నిసార్లు ఘాటు విమర్శలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత మోడీతో సత్సంబంధాలే మెయింటైన్ చేశారు. కేంద్రంతో బావుంటేనే నిధులొస్తాయన్న స్పృహే అందుకు కారణం కావచ్చు. కానీ ప్రస్తుతం మళ్లీ గులాబీ నేతల రూటు మారుతోంది. 

లేటెస్టుగా.. కేంద్రం మంజూరు చేసిన పట్టణ పేదల ఇష్యూ ఇలా వైఖరి మారేందుకు తక్షణ కారణంగా మారింది. దాదాపు 2 లక్షలకు పైగా పట్టణ పేదల ఇళ్లు ప్రకటించిన కేంద్రంలో అందులో 85శాతం వరకూ ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. ఏపీకి లక్షా 90 వేల ఇళ్లు ఇస్తే.. తెలంగాణకు కేవలం 10 వేల ఇళ్లు మంజారు చేసింది. ఇళ్ల కేటాయింపులో దారుణమైన వివక్ష చూపించడమే కాకుండా..అందుకు తెలంగాణ సర్కారు సరిగ్గా ప్రతిపాదనలు పంపకపోవడమే కారణమని వివరణ ఇచ్చారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. 

కేంద్రంతో సఖ్యతగా ఉన్నా తెలంగాణకు సంబంధించిన పనులు ఆశించినంతగా కాకపోవడంతో ఇక స్వరం పెంచాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష ప్రదర్శిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తడమే అందుకు సంకేతంగా కనిపిస్తోంది. కేంద్రం తెలంగాణపట్ల వ్యవహరిస్తున్న విధానం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు కవిత. కేంద్రం హైదరాబాద్ మీద ఒక ప్రేమ.. అమరావతి మీద మరొక ప్రేమ చూపుతున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్‌మెంట్ కోసం నిధులివ్వాలని ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవడం లేదంటూ నేరుగా వెంకయ్య నాయుడిపైనే విమర్శలు గుప్పించారు. 

కేవలం ఇళ్ల విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనూ కేంద్రం తెలంగాణకు మొండిచేయేచూపుతోందని కవిత విమర్శించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ నేరుగా ప్రధాని నరేంద్రమోడీని అయిదుసార్లు కలిసారని కవిత గుర్తు చేసింది. 2014 జూన్‌లో 14 అంశాలను మోడీ దృష్టికి తీసుకువెళ్లారన్నారని, అయితే అందులో కనీసం ఒక్క ప్రతిపాదనను కూడా అనుమతించలేదని కవిత వివరించింది.

తెలంగాణకు ట్యాక్స్ ఇన్సెంటివ్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రాణహిత చేవెళ్లకు జాతీయహోదా, మూసీనది అభివృద్ధికి నిధులు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్శిటీ.. ఇలా ఎన్నో అంశాల్లో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని కవిత మండిపడ్డారు. బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి తమను విమర్శించడం మాని.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోడీని నిలదీయాలన్నారు. టీఆర్ఎస్ కరపత్రికగా పేరు బడిన నమస్తే తెలంగాణ పత్రిక కూడా తెలంగాణపై కేంద్రం కుట్ర అనే కోణంలోనే కథనాలిస్తోంది. అంటే మోడీతో యుద్ధానికే కేసీఆర్ సిద్ధమయ్యారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: