ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈ పేరు చెబితే మనకు జగన్ అక్రమాస్తుల కేసులే గుర్తుకొస్తాయి. ఆయన కేసుల్లో అంతగా ఫేమస్ అయ్యిందీ సంస్థ. అయితే రాజకీయ నాయుకులు, పారిశ్రామికవేత్తలతో పాటు ఇప్పుడు వార్తా ఛానళ్లను కూడా ఈ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భయపెడుతోంది. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీకి ఈ ఈడీ నోటీసులు పంపడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 

సూటుకేసు కంపెనీల సంగతి తెలిసే ఉంటుంది. కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపే సంస్థలు మారిషస్, సింగపూర్ వంటి దేశాల్లో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి లావాదేవీలు సాగిస్తుంటాయి. అంటే సదరు కంపెనీలు నిజంగా ఉండవన్నమాట. కేవలం అక్రమ లావాదేవీల కోసమే వీటిని సృష్టిస్తారు. ఎన్డీటీవీ కూడా అలాంటి తప్పుడు పనులే చేసిందన్నది ఆ ఛానల్ పై ఉన్న ఆరోపణ. 

విదేశీ మారక ద్రవ్యం నిబందనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఎన్డీటీవీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు.. రిజర్వు బ్యాంకు కూడా ఈ సంస్థ లావాదేవీలను తప్పు పట్టింది. సుమారు రెండు వేల కోట్ల రూపాయల మేర నిధులను ఈ కంపెనీ మారిషస్ రూట్ లో తెచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీ న్యూస్ ఛానల్ తోపాటు అనేక సబ్సిడియరీ సంస్థలను నిర్వహిస్తోంది.

అలాంటి సంస్థల పేరుతోనే మారిషస్ వంటి దేశాల నుంచి ఎన్డీటీవీ గ్రూపు నిదులు మళ్లించిందని చెబుతున్నారు. అయితే ఎన్డీటీవీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తమకు ఇచ్చిన ఈడీ నోటీసు చెల్లదని వాదిస్తోంది. నిధులపై తాము అన్నివివరాలు బయటపెడతామని.. న్యాయపోరాటం చేస్తామని చెబుతోంది. అక్రమాలు వెలికి తీసే ఇలాంటి మీడియా సంస్థపైనే ఇలాంటి ఆరోపణలు రావడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: