సమకాలీన రాజకీయాల్లో ఆయన బాగా తలపండిపోయిన వ్యక్తి.. అవతలి వ్యక్తి ఎంత పద్ద నాయకుడు అయినా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్న వాడు అయినా సరే.. అతని ముఖప్రీతి కోసం కాకుండా.. తాను తలచినట్లుగా మాట్లాడుతూ.. యథేచ్ఛగా విమర్శలతో విరుచుకుపడిపోయేతత్వం ఆయనది. వ్యక్తిపూజకు తిరుగులేని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీనే అయినప్పటికీ.. చంద్రబాబునాయుడు అశక్తత గురించి ఇప్పటికే పలుమార్లు తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన ఆయన అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి. ఆయన మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం గురించి అపశకునాలే పలుకుతున్నారు. 


తొలినుంచి కూడా ఏపీకి అసలు హోదా వచ్చే అవకాశమే లేదు. ఏదన్నా ఉంటే గింటే ప్యాకేజీలు రావాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదు అనే మాట ఒక్కటే మాట్లాడుతూ వస్తున్న జేసీ దివాకర్‌ రెడ్డి.. మళ్లీ తాజాగా కూడా అవే డైలాగులు వల్లిస్తున్నారు. అయితే గియితే ఏదైనా ప్యాకేజీకోసం చూడాల్సిందే తప్ప సీమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకహోదా వచ్చే చాన్సే లేదంటున్నారు. 


అదే సమయంలో ప్రత్యేక రాయలసీమ అనే డిమాండుతో జరుగుతున్న ప్రచారాన్ని కూడా జేసీ దివాకరరెడ్డి కొట్టిపారేయడం విశేషం. చంద్రబాబునాయుడు అమరావతి మరియు ఇతర ఆంధ్రా కోస్తా ప్రాంతాల మీద పెడుతున్న శ్రద్ధతో పోలిస్తే.. రాయలసీమకు చాలా అన్యాయం జరుగుతున్నదనే వాదన ఇటీవలి కాలంలో ప్రముఖంగా తెరమీదకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 


రాయలసీమ హక్కుల గురించి పోరాడుతున్న వారు.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇవన్నీ తుస్సుమనే ఉద్యమాలే అంటూ జేసీ దివాకరరెడ్డి కొట్టి పారేస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉద్యోగాలనుంచి రిటైరైన వారు మాత్రమే ప్రత్యేక రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని ఇవేవీ నిలబడేవి కాదని ఆయన అంటున్నారు. 


ప్రత్యేక హోదా రాకపోతో పాయె.. కనీసం తెలుగుదేశం పాలకులు అధికారికంగా ఆ విషయం తేల్చేస్తేపోతుంది. ప్రజలు ఆశలు పెంచుకోకుండా.. నిమ్మళంగా చేతకాని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాటతప్పే కేంద్రాన్ని తిట్టుకుంటూ బతికేస్తారు. అలా కాకుండా.. మోసపూరితంగా ఎందుకు ఇంకా కాలం సాగదీస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: